డేంజర్‌ బెల్స్‌; రోజుకు నలుగురు మిస్సింగ్‌ | Sakshi
Sakshi News home page

రోజుకు నలుగురు బాలికల అదృశ్యం

Published Wed, Nov 20 2019 10:27 AM

Four Girls Missing Every Day in Mumbai - Sakshi

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై లాంటి మహానగరంలో బాలికల అదృశ్య సంఘటనలు పెరిగిపోయాయి. ప్రతీరోజు సగటున నలుగురు బాలికలు అపహరణకు గురవుతున్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అపహరణకు గురైన వారిలో 15–17 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే అధికంగా ఉన్నారు. అంతేగాకుండా ఇలా అపహరణకు గురైన వారిలో పెళ్లి పేరుతో నమ్మించి మోసపోయిన బాలికలే అధికంగా ఉన్నారు.
 
భయంతోనే..
మైనర్‌ బాలికలు అపహరణకు గురికావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు అంటే గడిచిన 10 నెలల్లో ఏకంగా 1,141 మైనర్‌ బాలికలు అపహరణకు గురైనట్లు వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అందులో 912 కేసులు పరిష్కరించడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. అపహరణకు గురైన బాలికల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కేసులే అధికంగా ఉన్నాయని దర్యాప్తులో పోలీసులు తేల్చారు. మైనర్‌ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ అపహరణ కేసులను సీరియస్‌గా తీసుకుంటున్నారు. కాని పట్టుబడిన తరువాత చేపట్టిన విచారణలో పెళ్లి పేరట మోసపోయిన  కేసులే అధికంగా వెలుగులోకి వస్తున్నాయి.

కొందరు బాలికల తల్లిదండ్రులు పరువు పోతుందని, అలాగే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందనే భయంతో ఫిర్యాదులు చేయడానికి వెనకడగు వేస్తున్నారు. కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ తరువాత ఉప సంహరించుకుంటున్నారు. మైనర్‌ బాలికలు సులభంగా మోసపోవడానికి కొన్ని ప్రధాన కారణాలను పోలీసులు వెల్లడించారు. మోసపోయిన వారిలో అధికంగా కాలేజీలకు వెళ్లే బాలికలే ఉన్నారు. నేటి సినిమాల ప్రభావం కూడా మోసపోవడానికి తోడవుతున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, అత్యాచారం చేసి ఆ తరువాత బ్లాక్‌ మెయిల్‌ చేయడం, సోషల్‌ మీడియాను అతిగా వాడడం ఇలా కొన్ని ప్రధాన కారణాలున్నాయి.  

Advertisement
Advertisement