‘ఎవరెస్ట్’తెలుగు తేజాలకు అపూర్వ సన్మానం | Sakshi
Sakshi News home page

‘ఎవరెస్ట్’తెలుగు తేజాలకు అపూర్వ సన్మానం

Published Mon, Aug 25 2014 3:41 AM

‘ఎవరెస్ట్’తెలుగు తేజాలకు అపూర్వ సన్మానం

  • మాలవత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు కన్నడ సంప్రదాయలో సన్మానం
  •   ఉన్నతచదువులకు సాయం చేస్తామన్న ప్రవాసాంధ్రులు
  • బెంగళూరు : ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన  తెలంగాణ తెలుగు తేజాలు  పూర్ణ (15), ఆనంద్ కుమార్ (18)లకు ఇక్కడి జేసీ రోడ్డులోని రవీంద్ర కళాక్షేత్రలో బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సిద్దం నారయ్య అధ్యక్షతన ఘనంగా సన్మానించారు.

    ఈ సందర్భంగా  మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్‌లను కర్ణాటక సాంప్రదాయం ప్రకారం శాలువా, మైసూరు పేటతో సత్కరించి షీల్డ్‌లు అందించారు. కార్యక్రమానికి పలు తెలుగు ప్రముఖులతో పాటు ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాలవత్‌పూర్ణ, ఆనంద్ మాట్లాడుతూ తాము ఈ సన్మానాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమాని హాజరైన మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... మైనస్ 30 డిగ్రీలు ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం దేశానికి వారు గర్వకారణమని చెప్పారు.
     
    కార్యక్రమానికి హాజరైన ఐపీఎస్ అధికారి తూకివాకం సునీల్ కుమార్ మాట్లాడుతూ విజేతలు భవిష్యత్తులో ఐపీఎస్ చదువుతామని చెప్పడం గర్వంగా ఉందన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ. రాధకృష్ణరాజు మాట్లాడుతూ... పూర్ణ, ఆనంద్ కుమార్‌లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ ఎవరెస్ట్ విజేతలకు ఉన్నత చదువులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
     
    ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ. 5,116 చొప్పున అందజేశారు. కార్యక్రమానికి బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ రమేష్, ఐఆర్‌ఎస్ అధికారిణి చంద్రిక, లోకాయుక్త డీఎస్‌పీ నారాయణ, ఎవరెస్ట్ విద్యార్థుల కోచ్  శేఖర్‌బాబుతో పాటు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిద్దం నారయ్య, పత్తిపాటి ఆంజనేయులు, హెచ్‌ఏఎల్ తెలుగు సాహిత్య సమితి అధ్యక్షుడు ఎల్. నాగేశ్వరావు తదితరులు మాట్లాడారు. అంతకు ముందు కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అనంతమూర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు బీ.కుపేంద్రరెడ్డి రూ. 50 వేలు, చామరాజపేట శాసన సభ్యుడు ఆర్.వీ. దేవరాజ్ రూ. 50 వేలు చొప్పున  మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్‌లకు అందించారని డీఎస్పీ నారాయణ తెలిపారు.
     
    తెలంగాణ శిఖరాలు : తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన అమానత్‌పూర్ణ, ఖమ్మం జిల్లా ధర్మమండలం సమీపంలోకి కలివేరు గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్‌లు తొమ్మిది నెలల పాటు డార్జిలింగ్‌లో శిక్షణ పొందారు. ఇదే ఏడాది మే 25న వీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
     

Advertisement
Advertisement