సాక్షి, చెన్నై : ఏర్కాడు ఉప ఎన్నికల బరిలో దిగేందుకు డీఎంకే నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. తమ కంటే తమకు సీటు ఇవ్వాలంటూ అన్నా అరివాళయంలో దరఖాస్తులు చేసుకున్నారు.
ఏర్కాడు సీటు కోసం డీఎంకే ఇంటర్వ్యూలు
Oct 11 2013 3:37 AM | Updated on Sep 1 2017 11:31 PM
సాక్షి, చెన్నై : ఏర్కాడు ఉప ఎన్నికల బరిలో దిగేందుకు డీఎంకే నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. తమ కంటే తమకు సీటు ఇవ్వాలంటూ అన్నా అరివాళయంలో దరఖాస్తులు చేసుకున్నారు. శుక్రవారం జరిగే ఇంటర్వ్యూల మేరకు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి ఖరారు చేయనున్నారు.
ఎమ్మెల్యే పెరుమాల్ మరణంతో సేలం జిల్లా ఏర్కాడు రిజర్వుడు నియోజకవర్గ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆ స్థానం భర్తీకి ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. దీంతో ఏర్కాడులో ఎన్నికల సందడి నెలకొంది. డిసెంబర్ నాలుగున ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 20న అన్ని ప్రక్రియలు ముగించి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓ వైపు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. అలాగే ఎన్నికల బరిలోకి అభ్యర్థుల్ని దించేం దుకు రాజకీయ పక్షాలు ఉరకలు తీస్తున్నాయి.
తమ సీటును మళ్లీ చేజిక్కించుకునేందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పావులు కదుపుతున్నారు. గెలుపు ఖాయమయ్యే అవకాశాలు ఉండడంతో తమ కంటే తమకు సీటు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సీటు పెరుమాల్ తనయుడు రాజేష్‌ఖన్నా లేదా అక్కడి పార్టీ నాయకుడు తంగమణిని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. సీపీఐ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, సీపీఎం సైతం మద్దతు ప్రకటించిన పక్షంలో విజయం తమదేనన్న ధీమాను ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక డీఎంకేలో సైతం సీటు కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అన్నాడీఎంకేపై వ్యతిరేకత బయలుదేరిందన్న సంకేతాలతో ఈ ఎన్నికల్ని లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండంగా మలచుకునేందుకు ఆ పార్టీ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి.
నేతల క్యూ
గెలుపు తమ వైపు ఉంటుందన్న ధీమాతో డీఎంకే నాయకులు సీటు కోసం పార్టీ రాష్ర్ట కార్యాలయం అన్నా అరివాళయానికి క్యూ కట్టారు. బుధ, గురువారాల్లో ఎన్నికల బరిలో నిలిచే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని డీఎంకే స్వీకరించింది. అన్నా అరివాళయంలో ఈ దరఖాస్తుల్ని సేలం ఇన్‌చార్జ్ శివలింగం స్వీకరించారు. తమ కంటే తమకు సీటు కావాలని పదికి పైగా ఆశావహులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. వీరిలో ఇది వరకు ఎన్నికల బరిలో నిలబడి పెరుమాల్ చేతిలో ఓటమి చవి చూసిన మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వన్ కూడా ఉన్నారు.
ఆ నియోజకవర్గానికి చెందిన మహిళా విభాగం నాయకురాలు ధనకోడి సైతం తనకే సీటు ఇవ్వాలని అధిష్టానానికి విన్నవించుకోవడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న వారందరికీ శుక్రవారం ఇంట ర్వ్యూలు జరగనున్నాయి. అధినేత కరుణానిధి, కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగే ఈ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులయ్యేవారే ఏర్కాడు బరిలో డీఎంకే అభ్యర్థిగా ఉండనున్నారు. ఇక ఈ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రధాన ప్రతి పక్షం డీఎండీకే కుస్తీలు పడుతుండడం కొస మెరుపు.
Advertisement
Advertisement