రాజ్యసభే దిక్కు!


  • కర్ణాటక నుంచి ఎంపికకు  కసరత్తు

  •  చిదంబరానికి రూట్ క్లియర్

  •  కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరానికి రాజ్యసభ పదవి దిక్కు అయింది. కర్ణాటక నుంచి ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేయడానికి ఏఐసీసీ కసరత్తులు చేపట్టింది. రూట్ క్లియర్ కావడంతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చినా, రాకున్నా, తనకు మాత్రం ఎంపీ పదవి ఖాయం అన్న ధీమా చిదంబరంలో పెరిగినట్టు సమాచారం.

     

    సాక్షి, చెన్నై : తమిళనాడు నుంచి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వారిలో పి.చిదంబరం ప్రథముడు. రాష్ర్ట కాంగ్రెస్ పార్టీలోని గ్రూపుల్లో రెండో ప్రధాన గ్రూపుగా ఉన్న చిదంబరం హవాకు ఇన్నాళ్లు తిరుగే లేదు. కేంద్ర ఆర్థిక మంత్రిగా, హోంమంత్రిగా, మళ్లీ ఆర్థిక మంత్రిగా పనిచే సిన చిదంబరానికి ఈ లోక్‌సభ ఎన్నికలు సంక్లిష్ట పరిస్థితులను సృష్టించాయి. ఎన్నికలంటే చాలు పోటీకి ముందు వరుసలో ఉండే చిదంబరం ఈ సారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.



    ఇందుకు కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులు అధ్వానంగా ఉండడంతో ఓటమి భయంతో తాను పోటీ చేయను బాబోయ్ అంటూ చేతులెత్తేశారు. చివరకు తనయుడిని లోక్‌సభ బరిలో దించి, గెలుపు లక్ష్యంగా రేయింబవళ్లు శ్రమించారు. వారసుడి రాజకీయ జీవితం మీద ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న బెంగ చిదంబరంను వెంటాడుతోంది. అదే సమయంలో తనయుడు గెలిచినా, గెలవకున్నా, తాను మాత్రం ఎంపీగా కొనసాగుతానన్న ధీమా ఆయనలో ఉన్నట్టు సమాచారం.

     

    రాజ్యసభే దిక్కు: కేంద్రంలో మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో మంత్రి పదవిలో తమ నేత కొనసాగడం ఖాయం అన్న ధీమా చిదంబరం మద్దతుదారుల్లో ఉంది. రాజ్యసభ సీటు ద్వారా ఆయన్ను మళ్లీ మంత్రి పదవి వస్తుంది.



    యూపీఏకు పతనం ఎదురైన పక్షంలో తమ నేత ఎంపీగా కొనసాగడం ఖాయం అంటున్నారు. ఆయన్ను రాజ్య సభకు పంపించేందుకు ఏఐసీసీ సర్వం సిద్ధం చేయడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన ఎస్‌ఎం కృష్ణతో పాటుగా మరో ముగ్గురి పదవీ కాలం జూన్ నెలాఖరులో ముగియనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన సాగుతుండడం, ఆ పార్టీకి 122 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇక్కడి నుంచి చిదంబరంను రాజ్య సభకు పంపించేందుకు రూట్ క్లియర్ చేశారు.



    ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోరుున  దృష్ట్యా, ఇక దక్షిణాదిలో మిగిలి ఉన్న కర్ణాటక మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏఐసీసీకి ఏర్పడింది.  అధిష్టానం ఆదేశాలకు కర్ణాటక కాంగ్రెస్ తల వంచక తప్పదని, తమ నేత రాజ్యసభ ద్వారా ఎంపీగా కొనసాగడం తథ్యమని చిదంబరం మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top