 
															దినకరన్ నివాసంలో పోలీసుల సోదాలు
ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్ అయిన దినకరన్ నివాసంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు.
	న్యూఢిల్లీ: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్ అయిన దినకరన్ నివాసంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. కాగా విచారణ నిమిత్తం ఆయనను న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అప్పగించిన దృష్ట్యా, దినకరన్‌ను  ఇవాళ ఢిల్లీ పోలీసులు చెన్నైకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిదిమంది సభ్యుల బృందం దినకరన్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణిని కూడా పోలీసులు విచారణ చేయనున్నట్లు సమాచారం.
	
	కాగా  అన్నాడీఎంకే పార్టీ చిహ్నం కోసం రూ.50 కోట్లు ఎరగా వేయడం వెనుక దినకరన్ ఒక్కడి హస్తం మాత్రమే ఉండే అవకాశాలు లేవని, ఆ పార్టీకి చెందిన వారికి కూడా ఈ విషయాలు తెలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే  ఈ కేసులో పది కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు సంకేతాలు ఉన్నా, పట్టుబడింది మాత్రం రూ.1.3 కోట్లే కావడంతో మిగిలిన మొత్తంపై లెక్క తేలాల్సి ఉంది.  ఈ మొత్తం ఎవరి చేతిలో ఉన్నాయో, దీని వెనుక మరెవ్వరి హస్తం అయినా ఉండొచ్చన్న సంకేతాలతో, తదుపరి అరెస్టు ఎవరో, తదుపరి ఉచ్చు ఎవర్ని బిగుసుకుంటుందో అనే దానిపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
