ఇటీవల నిర్వహించిన హౌసింగ్ స్కీమ్ డ్రా ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకొన్నట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ డె వలప్‌మెంట్ అథారిటీ ఈ స్కీం
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నిర్వహించిన హౌసింగ్ స్కీమ్ డ్రా ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకొన్నట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ డె వలప్‌మెంట్ అథారిటీ ఈ స్కీం కింద ఫ్లాట్లు కేటాయించిన వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరీశీలించే ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తులను స్క్రూటినీ చేసిన తరువాత అన్నీ సక్రమం గా ఉన్న లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇస్తే సదరు లబ్ధిదారుడికి ప్లాటు కేటాయింపును రద్దు చేసి, వెయిటింగ్ జాబితాలో ఉన్న దరఖాస్తుదారుకు కేటాయిస్తారు. లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించే తుది ప్రక్రియలో జాప్యం చేయబోమని డీడీఏ తెలిపింది.ఈ ప్రక్రియను ఈ నెల రెండో వారంలో ప్రారంభించనుం ది. ఇందుకోసం డీడీఏ 15 రోజుల పాటు ప్రత్యేక శిబి రాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పేర్ల తారుమారే.. అవకతవలు జరగలేదు
డీడీఏ హౌసింగ్ స్కీమ్ -2014 కింద 25 వేలకు పైగా ప్లాట్లను ఇటీవల తీసిన డ్రా ద్వారా కేటాయించారు. ఈ స్కీం కోసం డీడీఏకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్లాట్లు కేటాయించిన దరఖాస్తుదారుల్లో ముగ్గురి దరఖాస్తులు వరుసగా ఉన్న కారణంగా డ్రాలో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇందులో అవకతవకలు జరుగలేదని డీడీఏ తెలిపింది. కానీ కొన్ని కేసులో దరఖాస్తు నంబర్, పాన్ నంబరు, చిరునామా వేర్వేరుగా ఉన్నాయి. కానీ, ప్లాట్లు కేటాయించిన వారి పేర్లు, తండ్రి పేర్లు ఒకేలా ఉన్నట్లు దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనలో తేలింది. చాలా కేసుల్లో దరఖాస్తు నంబరు, చిరునామాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ దరఖాస్తుల నంబర్లు వరుసగా ఉన్నాయి. యుద్ధ వితంతువులకు సంబంధించిన కొన్ని కేసుల్లో పేరు, లింగం తారుమారాయ్యాయి. అంటే మహిళ పేరున్న చోట లింగం పురుషునిగా, పురుషుని పేరున్న చోట లింగం స్త్రీగా పేర్కొనడంతో జాబితాలో గందరగోళంగా అనుమానాలకు తావిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్లాట్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.