కరెన్సీ కమీషన్ | Currency Commission | Sakshi
Sakshi News home page

కరెన్సీ కమీషన్

Nov 21 2016 2:50 AM | Updated on Apr 3 2019 5:16 PM

నల్లధనం అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపడితే, మరో వైపు దొడ్డి దారిన ఆ ధనాన్ని తెలుపుగా మార్చే పనిలో బ్యాంకుల సిబ్బంది

నల్లధనం అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపడితే, మరో వైపు  దొడ్డి దారిన ఆ ధనాన్ని తెలుపుగా మార్చే పనిలో బ్యాంకుల సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కమీషన్‌కు ఆశపడ్డ రెండు బ్యాంకుల సిబ్బంది, చివరకు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి.  ఇక, ఆదివారం  బ్యాంక్‌లకు సెలవు కావడం, ఏటీఎంలలో నగదు  కరువుతో చిల్లర కష్టాలు మరింత జఠిలమయ్యాయి.
 
 సాక్షి, చెన్నై: నల్లధనం అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న చర్యలతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. చివరకు రూ. 2000 నోటు చిక్కినా, చిల్లర కోసం నానా వెతలు. అదే సమయంలో బ్యాంక్ సిబ్బంది అనేక చోట్ల కమీషన్లకు ఆశపడి తమ చేతి వాటం చూపుతూ దొడ్డిదారిన నల్లధనాన్ని తెలుపుగా మార్చేస్తున్నారని ఆరోపణలు వచ్చినా పట్టించుకునే పాలకులు కరువే.
 
  సామాన్యులు క్యూలో బారులు తీరుతుంటే, సంపన్నులకు , నల్లధనం దాచి పెట్టుకున్న వాళ్లకు సులభంగానే కొత్త నోట్లు చిక్కుతున్నాయని చెప్పవచ్చు. ముప్పై నుంచి నలభై శాతం మేరకు కమీషన్లతో నల్లధనం తెలుపుగా మారుతున్నదని వస్తున్న ఆరోపణలకు బలం చేకూరే ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బ్యాంకుల్లోని సిబ్బంది పని తీరుపై నిఘా పెట్టేందుకు ఐటీ, విజిలెన్‌‌స వర్గాలు రంగంలోకి దిగాయి. ఇక సెలవు దినం రోజున బ్యాంకుల మూతతో, ఏటీఎంలలో నగదు కరువుతో జనానికి పాట్లు తప్పలేదు. జనం చేతిలో చిల్లర్లు లేని దృష్ట్యా, వారంతంలో పర్యాటక కేంద్రాలన్నీ బోసి పోయాయి.
 
 కమీషన్ కోసం ఆశ పడి:  శుక్రవారం శాస్త్రి నగర్ బ్యాంక్‌కు చెందిన రూ.25 లక్షలు చోరీకి గురైనట్టు పల్లావరం పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అదే రోజు అర్ధరాత్రైనా బ్యాంక్ మేనేజర్‌తో సహా సిబ్బంది పలువురు బ్రాంచ్ కార్యాలయంలో ఉండడాన్ని శాస్త్రి నగర్  గస్తీ పోలీసులు గుర్తించారు. బ్యాంక్ సొమ్ము చోరీ సమాచారంతో శాస్త్రి నగర్ , పల్లావరం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా, అసలు బండారం ఏమిటో ఆదివారం వెలుగులోకి వచ్చింది. 
 
 శాస్త్రి నగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఇలంగోవన్ తన మిత్రుడు రాజేష్  వద్ద ఉన్న రూ.25 లక్షలు నల్లధనాన్ని తెలుపుగా మార్చేందుకు పథకం రచించాడు. ముప్పై శాతం కమీషన్ అంటూ అక్కడి మేనేజర్ లోకేశ్వరరావుకు ఆశ చూపించాడు. మరో ప్రైవేటు బ్యాంక్‌లో ఉన్న ఇద్దరు మిత్రుల సహకారంతో నగదు మార్పిడికి ఇలంగోవన్ చర్యలు తీసుకున్నాడు. రూ.2000 కొత్త నోట్లతో రూ.25 లక్షలను  శుక్రవారం బ్యాంక్‌లో తీసుకున్నాడు.
 
  తమకు రావాల్సిన కమీషన్‌ను పక్కన పెట్టి, మిగిలిన సొమ్మును రాజేష్‌కు అప్పగించేందుకు నిర్ణయించాడు. జమీన్ పల్లావరంలో ఉన్న రాజేష్ వద్దకు మేనేజర్ లోకేశ్వరరావు, క్యాషియర్ ఇలంగోవన్, ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది, కారు డ్రైవర్ బయల్దేరి వెళ్లారు. కొత్త నోట్లను తీసుకున్న రాజేష్ , రూ.25 లక్షలకు గాను వెయి రూపాయల పాత నోట్లను వారికి  అప్పగించాడు. ఆ మొత్తంతో తిరుగు పయనంలో ఉండగా మార్గ మధ్యలో దొంగలు పడ్డారు. వాళ్లను చితక్కొట్టి ఆ నగదుతో ఉడాయించారు. 
 
 నలుపు తెలుపుగా మార్చే క్రమంలో ఈ చోరీ జరిగినట్టు తెలిస్తే, తమ బండారం బయట పడుతుందని అపహరణ నాటకం రచించారు. చివరకు విచారణలో బండారం బయట పడింది. అదే సమయంలో నగదుతో వెళ్తున్న వాళ్లను చితక్కొట్టి లాక్కున్నే పథకం రచించింది కూడా ఇలంగోవన్, అతడి మిత్రుడు రాజేష్‌గా విచారణలో తేలింది. అయితే, దోచుకున్న సొమ్ముతో రాజేష్ వద్దకు వెళ్లాల్సిన, దొంగలు, తమ పనితనాన్ని ప్రదర్శించి, పలాయనం చిత్తగించారు. అజ్ఞాతంలో ఉన్న రాజేష్, అతడి అనుచరులు(దొం గల) కోసం పోలీసులు వేట మొదలెట్టారు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, కారు డ్రైవర్, మరో ఇద్దర్ని తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
 ఐటీ అటాక్: నల్లధనం తెలుపుకు  బ్యాంక్ సిబ్బంది తమ చేతి వాటం ప్రదర్శిస్తుంటే,  ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం దాచుకున్న సొమ్మును సిబ్బంది అకౌంట్లో వేసి ఐటీ చేతికి చిక్కింది. ఓఎంఆర్ రోడ్డులోని ఓ ప్రముఖ విద్యాసంస్థ పరిధిలో అనేక కళాశాలలు, స్కూళ్లు ఉన్నారుు. విద్యార్థుల వద్ద రశీదులు లేకుండా సేకరించి, దాచుకున్న రూ.8 కోట్ల మేరకు నల్లధనాన్ని ఆ యాజమాన్యం నమ్మకంగా ఉన్న వంద మంది సిబ్బంది అకౌంట్లలోకి మార్చినట్టు సమాచారం.
 
  ఒకే సారిగా ఆయా అకౌంట్లలోకి నగదు లక్షా, రెండు లక్షలు చొప్పున పడడం ఐటీ వర్గాలు నిఘా వేశారుు. నల్లధనం తెలుపుగాకునే క్రమంలో ఈ తంతు సాగుతున్నట్టు గుర్తించి ఆదివారం ఆ విద్యాసంస్థల మీద దాడులు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఐటీ చేతికి చిక్కిన ఆ యాజమాన్యం కాళ్ల బేరానికి వచ్చి ఆ మొత్తానికి పన్ను చెల్లింపునకు సిద్ధం అని ప్రకటించినట్టు సమాచారం. అయితే, దోచుకున్న సొమ్ముకు పన్నుగా ఏడున్నర కోట్ల మేరకు చెల్లించాల్సి  ఉంటుందని ఐటీ వర్గాల సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement