దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ | Sakshi
Sakshi News home page

దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ

Published Wed, Apr 26 2017 4:57 PM

దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ - Sakshi

న్యూఢిల్లీ: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్‌ అయిన  అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అయిదు రోజులు పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ డీసీపీ మాట్లాడుతూ ఈ కేసులో దినకరన్‌ ప్రమేయంపై కావాల్సినన్నీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే మరింత సమాచారం బయటకు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. కాగా దినకరన్‌తో పాటు ఆయన సన్నిహితుడు మల్లికార్జునను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

కాగా వరుసగా నాలుగు రోజుల పాటు దినకరన్‌ను ప్రశ్నించిన ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు.. ఎట్టకేలకు ఆయనను గతరాత్రి అరెస్టు చేశారు. తమ వర్గానికి రెండాకుల గుర్తు తెచ్చుకోవడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న నేరంలో దినకరన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు.

పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసినా, దినకరన్‌ను దాచిపెట్టారన్నది మల్లికార్జునపై ఉన్న అభియోగం. వీళ్లిద్దరినీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే దినకరన్‌ను తమ కస్టడీకి అనుమతించాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు...అయిదురోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement