కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయమార్కెట్‌లో మొన్నటి వరకు అత్యధికంగా పలికిన పత్తి ధర సోమవారం ఉదయం భారీగా తగ్గింది.
భారీగా తగ్గిన పత్తి ధర
Oct 24 2016 10:47 AM | Updated on Jun 4 2019 5:16 PM
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయమార్కెట్‌లో మొన్నటి వరకు అత్యధికంగా పలికిన పత్తి ధర సోమవారం ఉదయం భారీగా తగ్గింది. శుక్రవారం వరకు క్వింటాలుకు రూ. 5,372 పలికిన ధర రూ.4,960 కు పడిపోయింది. ఈ పరిణామంతో రైతులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన డిమాండ్ ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటుండగా పత్తి ఎక్కువ మొత్తంలో రావటంతో వ్యాపారులే కుమ్మక్కయి రేటు తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ సీజన్లో మొదటి సారిగా సోమవారం భారీ మొత్తంలో మార్కెట్‌కు పత్తి చేరుకుంది. దాదాపు 2000 మంది రైతులు సుమారు 8 వేల క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చినట్లు అంచనా. పత్తిని తరలించుకు వచ్చిన దాదాపు 300 వాహనాలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ విధానంలో పత్తిని కొనుగోలు చేసే ఇనాం విధానాన్ని అమలు చేస్తున్నట్లు శుక్రవారం అధికారులు అట్టహాసంగా ప్రకటించారు. అయితే, జమ్మికుంట మార్కెట్‌లో మాత్రం ఈ ఛాయలేవీ కానరాలేదు. అధికారులు కిమ్మనక ఉండగా వ్యాపారులు, దళారులే కుమ్మక్కయి కొనుగోళ్లు జరుపుతున్నారు.
Advertisement
Advertisement