చెన్నై మళ్లీ చిత్తడి! | Chennai swamp again! | Sakshi
Sakshi News home page

చెన్నై మళ్లీ చిత్తడి!

Dec 7 2015 2:35 AM | Updated on Aug 20 2018 9:16 PM

చెన్నై మళ్లీ చిత్తడి! - Sakshi

చెన్నై మళ్లీ చిత్తడి!

చెన్నై నగరం కోలుకుంటోంది.. కుదుటపడుతోంది.. అనే మాటలు వినిపిస్తున్నా స్థానికుల్లో మాత్రం ఆ భావన కనిపించడంలేదు.

ఆదివారం రోజంతా కురిసిన వాన..రోడ్లన్నీ జలమయం
 

♦ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి
♦ రెండ్రోజులపాటు వర్షాలు: వాతావరణశాఖ వెల్లడి
♦ సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా వాన
 
 చెన్నై నుంచి నందగోపాల్, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరం కోలుకుంటోంది.. కుదుటపడుతోంది.. అనే మాటలు వినిపిస్తున్నా స్థానికుల్లో మాత్రం ఆ భావన కనిపించడంలేదు. తామెప్పటికి కోలుకుంటామో కూడా చెప్పలేకపోతున్నారు. ఇల్లు.. వీధి అనే తేడాలేదు అంతటా మురుగే. వరదకు కొట్టుకొచ్చిన చెత్తాచెదారం అలాగే పడిఉంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 500 మంది మృతిచెంది ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థితిలో ఆదివారం మళ్లీ రోజంతా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ మళ్లీ జలమయమయ్యాయి. ఒక్కొక్కటిగా సేవలు పునరుద్ధరిస్తున్నా.. అన్నిచోట్లా జనం బారులు తీరుతున్నారు.

లగ్జరీగా బతికినవాళ్లుసైతం తాగునీరు, ఆహారం కోసం ఇప్పటికీ సహాయబృందాల వద్ద చేయిచాస్తున్నారు. నగరం నుంచి మరోచోటుకు వెళ్లడానికి బస్సు, రైలు, విమానసేవలు మొదలుకావడం కొంత ఊరటనిస్తోంది. కాగా నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడన ద్రోణి ఏర్పడనుందనే వార్త తమిళనాడుతోపాటు పుదుచ్చేరివాసులను కలవరానికి గురిచేస్తోంది. దీనికారణంగా రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

 చురుగ్గా సహాయ కార్యక్రమాలు..
 సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సిబ్బంది చురుగ్గా పాల్గొంటోంది. మొత్తం 50 బృందాలుగా విడిపోయి నగరవ్యాప్తంగా సాయమందిస్తున్నాయి. ఇప్పటిదాకా దాదాపు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 50 వేల ఆహారపదార్థాల పొట్లాలు, మరో 50 వేల నీళ్ల సీసాలను బాధితులకు సరఫరా చేశాయి. ఎన్డీఆర్ ఎఫ్ వైద్య బృందాలు 200 మందిని ప్రాణాపాయం నుంచి బయటపడేశాయి. కాగా నగరవ్యాప్తంగా 1,27,580 మంది 114 పునరావాసకేంద్రాల్లోనే గడుపుతున్నారు.

 ఇప్పటికిప్పుడు తాగునీరు అందించలేం: చెన్నై కార్పొరేషన్
 వరదల కారణంగా సర్వం కోల్పోయిన నగరవాసులకు కనీసం తాగునీటిని అందించే పరిస్థితి కూడా లేదని చెన్నై కార్పొరేషన్ నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది. అందుబాటులో ఉంచిన తాగునీరు మొత్తం కలుషితమైందని, నీటిని శుద్ధిచేసే వ్యవస్థ కూడా దెబ్బతిన్నందున ఇప్పటికిప్పుడు మంచినీటిని అందించే పరిస్థితి లేదని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు.  

 స్థానిక అధికారులు సహకరించడంలేదు: ఆర్మీ
 సహాయచర్యల కోసం కేంద్రప్రభుత్వం మరిన్ని విపత్తు సహాయక బృందాలను, ఆర్మీ, వైమానిక సిబ్బందిని నగరానికి పంపింది. విమానం దిగిన బృందాలు నగరంలోని ఏ ప్రాంతానికి వె ళ్లాలో, ఎక్కడ తమ సాయం అవసరమో చెప్పేవారు లేక దాదాపు ఐదారుగంటలు సహాయకచర్యల్లో పాల్గొనలేకపోయారు. ఆ తర్వాత టీనగర్‌కు చేరుకున్నాక కూడా స్థానిక అధికారుల నుంచి వారికి ఎటువంటి సహకారమూ అందలేదు. వారే చొరవ తీసుకొని వెళ్లి అడిగినా అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు. స్థానిక అధికారుల తీరుపై ఆర్మీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వరద బీభత్సానికి స్తంభించిన రవాణా సేవలు కాస్త ఊపందుకున్నాయి. నగరవ్యాప్తంగా ఉచిత బస్సుసేవలు కొనసాగుతుండగా సోమవారం నుంచి అన్ని రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement