150 గుడిసెల కూల్చివేత | BMC has been the demolition of 150 huts | Sakshi
Sakshi News home page

150 గుడిసెల కూల్చివేత

Nov 19 2013 12:10 AM | Updated on Apr 3 2019 4:53 PM

తూర్పు భాండూప్‌లోని శ్యామ్‌నగర్‌లో మిగిలిన గుడిసెలపై బీఎంసీ సిబ్బంది మరోసారి బుల్డోజర్‌ను నడిపించారు.

సాక్షి, ముంబై:  తూర్పు భాండూప్‌లోని శ్యామ్‌నగర్‌లో మిగిలిన గుడిసెలపై బీఎంసీ సిబ్బంది మరోసారి బుల్డోజర్‌ను నడిపించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో వచ్చిన సంబంధిత అధికారులు సోమవారం సుమారు 150 గుడిసెలను నేలమట్టం చేశారు. అక్కడి బౌద్ధవిహార్‌ను కూల్చడమేకాకుండా అందులోని గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన పోలీసులను వారంతా పక్కకునెట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి చేయబోగా ఎదురుతిరిగారు. రాళ్లతో వారిపై దాడి చేశారు.

దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు వెనక్కి తగ్గడంతో స్థానికులు శాంతి ంచారు. కాగా గడచిన 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నవారిలో మహబూబ్‌నగర్ జిల్లావాసులతోపాటు మరాఠీ, గుజరాతి, తమిళం, కన్నడ భాషీయులు కూడా ఉన్నారు. శ్యామ్‌నగర్‌లో మొత్తం సుమారు 500 గుడిసెలుండగా వీటిలో 350 గుడిసెలను ఈ నెల 12వ తేదీన నేలమట్టం చేసిన సంగతి విదితమే. మిగిలిన 150 గుడిసెలను సోమవారం నేలమట్టం చేశారు. దీంతో అగ్రహించిన స్థానిక ప్రజలు ఉప్పు (సాల్ట్) ఉత్పత్తి విభాగానికి చెందిన అధికారులు, పోలీసులు, బీఎంసీ అధికారులత తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. శ్యామ్‌నగర్ నుంచి భాండూప్‌లోని ఉప్పు విభాగం కార్యాలయందాకా ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేశారు. అదేవిధంగా రాస్తారోకో కూడా నిర్వహించారు.  
 బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం
 ఈ విషయమై కొందరు స్థానికులు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా శ్యామ్‌నగర్‌లో నివసిస్తున్నామన్నారు. వారం రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామన్నారు. పిల్లాపాపలను వదిలి పనులకు వెళ్లలేకపోతున్నామని చెప్పా రు. పునరావాసం కల్పించకపోతే ఇక్కడి నుంచి కదలబోన్నారు.  
 కానరాని తెలుగు సంఘాలు
 ఒకటి రెండు సంఘాలు మినహా మహబూబ్‌నగర్ జిల్లా వాసులను ఆదుకునేందుకు తెలుగు సంఘాలేవీ పెద్దగా ముందుకురాలేదు.  తెలంగాణ సంఘీభావ వేదిక సభ్యులతోపాటు ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వచ్చారని బాధితులు తెలిపారు. అయితే అనేకసార్లు తెలుగు వారికి అండగా ఉంటామని చెప్పుకునే తెలుగు సంఘాలు పలకరించడానికి కూడా రాకపోవడంపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement