విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
– ఆటోను ఢీకొన్న లారీ
– ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురి దుర్మరణం
– మరో నలుగురికి తీవ్ర గాయాలు
– శోకసంద్రమయిన కేంద్రాసుపత్రి
ఈ సంఘటనతో ఆటో రెండు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు విజయనగరంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మరణించాడు. గాయపడిన నలుగురు విజయనగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం గులివిందపేటకు చెందిన గులివింద అప్పలనాయుడు(45), అదే మండలం చోడమ్మ అగ్రహారానికి చెందిన ఆవాల శంకరరావు(48), భోగాపురం మండలం మాల నందిగాంకు చెందిన మిరప గోవింద(37), డెంకాడకు చెందిన బంగారి సూరి(34), విజయనగరం పట్టణంలోని కోరాడ వీధికి చెందిన ఆర్.రాజేష్(23), శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నెల్లిమర్ల అప్పారావు(30) మృతి చెందిన వారిలో ఉన్నారు. గాయపడిన వారిలో డెంకాడకు చెందిన బంగారి అప్పారావు, పి.శ్రీను, విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన ఆటో డ్రైవర్ ముక్కు బంగార్రాజు, విజయనగరానికి చెందిన ఆర్.రాజశేఖర్ ఉన్నారు. మృతులు, గాయపడ్డ వారిలో అత్యధికం ప్రైవేటు కంపెనీల్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. మృతులపైనే కుటుంబీకులు ఆధారపడి ఉన్నారు.
లారీ డ్రైవర్, క్లీనర్ పరారీ
మితిమీరిన వేగంతో ప్రమాదానికి కారణమైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ ప్రమాదం సంభవించిన వెంటనే ఘటనా స్థలం నుంచి చూస్తుండగానే పారిపోయారు. చావు బతుకుల్లో ఉన్న క్షతగాత్రులను వదిలేసి పరారయ్యారు. ఈ మేరకు డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు, విజయనగరం ఆర్డీఓ శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఇక జిల్లా కేంద్రాస్పత్రిలో ఉన్న మృతుల కుటుంబీకులను, క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరామర్శించారు. ఇదిలా ఉండగా, మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలతో విజయనగరం జిల్లాకేంద్రాసుపత్రి శోకసంద్రమయ్యింది.