టెట్‌ అభ్యర్థులకు షాక్‌! | tdp government Announcement new GO on TET | Sakshi
Sakshi News home page

టెట్‌ అభ్యర్థులకు షాక్‌!

Jan 17 2018 9:41 AM | Updated on Aug 10 2018 8:34 PM

ఇప్పటికే డోలాయమానంలో ఉన్న టెట్‌ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత డీఎస్సీకి సంబంధించి టెట్‌ ప్రకటన విడుదల కావడంతో నిరుద్యోగ బీఈడీ అభ్యర్థుల్లో ఆశలు మొలకెత్తాయి. గత నెల రోజులుగా వీరంతా దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా మరో జీవోను సర్కార్‌ తెరపైకి తెచ్చింది. ఇది  టీపీటీ, హెచ్‌పీటీ అభ్యర్థులకు అనుకూలంగా ఉండగా..బీఈడీ సెకెండ్‌ మెథడ్స్‌ అభ్యర్థులకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రాజాం: నిరుద్యోగుల జీవితాలతో సర్కార్‌ ఆటలాడుతోంది. తాజాగా ఉపాధ్యాయ అభ్యర్థుల విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తోంది. గతంలో నిర్వహించిన టెట్‌లకు సంబంధించి బీఈడీ వాళ్లతోపాటు టీపీటీ, హెచ్‌పీటీ వాళ్లకు కూడా స్కూల్‌ అసిస్టెంట్‌లకు సంబంధించి టెట్‌ పేపర్‌–2 పరీక్ష ఉండేది. ఈ పరీక్ష 150 మార్కులకు ఉండగా ఇందులో సోషల్‌ లేదా గణితం సబ్జెక్టును ఎంచుకొని పరీక్ష రాయాల్సి ఉండేది. ఈ రెండు సబ్జెక్టుల్లో ఏదో ఒకటి ఎంచుకోవడం ద్వారా 60 మార్కులకు హెచ్‌పీటీ, టీపీటీ వాళ్లు కూడా సైన్సు లేదా సోషల్‌ సబ్జెక్టును ప్రిపేర్‌ కావాల్సి వచ్చేది. అయితే గత ఏడాది జనవరిలో హిందీ భాషోపాధ్యాయులు టెట్‌ పరీక్షలో పేపర్‌–2లో హిందీ భాషకు సంబంధించి 60 మార్కులకు కంటెంట్‌ను పెట్టాలని డిమాండ్‌ చేశారు. వాటిని ఇప్పటి వరకు పరిశీలించని ప్రభుత్వం టెట్‌ ప్రకటన జారీచేసిన నెల రోజులు అనంతరం కొత్త జీవోతో తలనొప్పులకు తెరతీసింది.

గంగరగోళంగా కొత్తజీవో...
ఈ నెల 12న ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్తజీవోలో భాషా పండితులకు సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ అభ్యర్థులు మూడవ ఆప్షన్‌ను ఎంచుకోవడంతోపాటు 60 మార్కులు వారి భాషకు సంబంధించిన కంటెంట్‌ను రాయాల్సి ఉంది. ఈ విధానం కేవలం తెలుగు పండిట్, హిందీ పండిట్, కళాశాల్లో ట్రైనింగ్‌ అయిన వారికి మాత్రమే వర్తించే విధంగా మారింది. రాష్ట్రంలో ఎక్కువుగా బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో బీఈడీ చేసిన అభ్యర్థులు ఒక సబ్జెక్టును సోషల్, బయాలజీ, ఫిజికల్‌ సైన్సు, గణితం ఎంచుకోగా రెండో మెథడ్‌ను తెలుగు, ఇంగ్లిష్‌లను ఎక్కువుగా ఎంపిక చేసుకున్నారు. వీరంతా ఇప్పటి వరకు టెట్‌–2 పేపర్‌కు సంబంధించి గణితం లేదా సోషల్‌ సబ్జెక్టుల్లో పరీక్ష రాసి డీఎస్సీకి అర్హత సాధించే వారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా బీఈడీ కళాశాలల్లో సెకెండ్‌ మెథడ్‌గా ఇంగ్లిష్, తెలుగు చేసిన అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వీరు ఇదివరకే టెట్‌–2కు దరఖాస్తు చేసి ఉండగా ఇప్పుడు కొత్త జీవోతో నెట్‌లో వీరి ఆప్షన్‌ను మార్చుకోవాలో, ఉంచుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీరు ఒక వైపు టెక్నికల్‌ సబ్జెక్టుల పరిధిలోకి రాగా మరోవైపు ఇంగ్లిష్, తెలుగు పండిట్‌ పరిగణలోకి కూడా వస్తారు. పండిట్‌ ప్రాతిపదికన టెట్‌ రాయాలనుకుంటే వీరంతా బీఈడీలో మొదటి మెథడాలజీగా చేసిన సైను, గణితం, సోషల్, బయలాజికల్‌ సైన్సు వంటి సబ్జెక్టులను కోల్పోవాల్సి వస్తుంది.

అంతా గందరగోళం
టెట్‌ నోటిఫికేషన్‌ వెలువడగానే చాలా మంది అభ్యర్థులు తమ ఉద్యోగాలను, ప్రైవేటు ఉద్యోగాలను, ఇంటి వద్ద వ్యవసాయ పనులను విడిచిపెట్టేశారు. ఎలాగైనా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే ఆశతో అప్పులుచేసి సుదూర ప్రాంతాలకు కోచింగ్‌ల కోసం వెళ్లారు. గత నెల రోజులుగా సిలబస్‌ ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం మళ్లీ సిలబస్‌ ప్రకటించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇంగ్లిష్‌ మెథడాలజీ అభ్యర్థులు బీఈడీలో రెండవ మెథడ్‌గా తెలుగు తీసిన అభ్యర్థులు అయోమయానికి గురౌతున్నారు.

కొందరికి మోదం
ఇదిలా ఉండగా ఈ కొత్త జీవోతో హిందీ, తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ కళాశాలల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు మాత్రం ఆనందంగా ఉన్నారు. ప్రధానంగా హిందీ పండిట్‌ ట్రైనీ అభ్యర్థులు సోషల్‌ సబ్జెక్టు లేదా గణితం చదవలేక టెట్‌ కోసం ఆపసోపాలు పడేవారు. ఈ కొత్త జీవోతో వీరికి సబ్జెక్టుకు సంబంధించి 60 మార్కులు అదనంగా కలవనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement