
కోల్‌కతా : క్రీడా రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గుండెపోటు రావడంతో ఓ యువ క్రికెటర్ ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. స్థానిక పైక్‌పారా స్పోర్ట్స్ క్లబ్ క్రికెటర్ అనికెత్ శర్మ (21) మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా అనికెత్ శర్మ ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. దీంతో సహచర క్రికెటర్లు దగ్గర్లోని సిటీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. గతేడాదే క్లబ్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అనికేత్ మంచి బ్యాట్స్‌మన్, బెస్ట్ ఫీల్డర్ అని కోచ్ తెలిపారు.
ఇక అనికేత్ మృతిపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) విచారం వ్యక్తం చేసింది. క్యాబ్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమన్నారు. అంకిత్ మృతితో రేపు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధకరమన్నారు. కష్టపడేతత్వం గల క్రికెటరని, భవిష్యత్‌లో గొప్ప క్రికెటర్ అవుతాడని అందరం భావించామన్నారు. అనికేత్ మరణ వార్త విని ఒక్కసారి షాక్‌కు గురయ్యాయని పైక్‌పారా స్పోర్ట్స్ క్లబ్ సారథి సంబ్రాన్ బెనర్జీ అన్నారు.