రాయుడు ఉంటే గెలిచేది కదా!

World Cup Loss Triggers Talk of Rayudu Heroics Against New Zealand - Sakshi

ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటం సెమీస్‌తో ముగియడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లిసేన.. న్యూజిలాండ్‌ చేతిలో చావు దెబ్బతినడం మరిచిపోలేకపోతున్నారు. మ్యాచ్‌ జరిగి 48 గంటలు గడిచినా ఆ ఓటమి క్షణాలను మదిలోంచి తొలిగించలేకపోతున్నారు. భారత ఓటమికి గల కారణాలేంటని విశ్లేషిస్తున్నారు. ప్రతి టీకొట్టు దగ్గర అదే ముచ్చట.. ఆఫీసుల్లో సహోద్యోగుల మధ్య ఇదే చర్చ. ఇక సోషల్‌ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, షేర్‌ చాట్‌.. టిక్‌ టాక్‌లు మ్యాచ్‌ విశ్లేషణలతో మారుమోగుతున్నాయి. పాండ్యా, పంత్‌లు కొద్దిసేపు ఉంటే మ్యాచ్‌ పరిస్థితి వేరేలా ఉండేదని ఒకరంటే.. అసలు రోహిత్‌, కోహ్లిలు ఔట్‌ కాకుంటే ఈ ఓటమే తప్పేదని మరొకరంటున్నారు. అసలు ధోని రనౌట్‌ కాకుంటే టైటిల్‌ రేసులో నిలిచేవారమని ఇంకోకరంటున్నారు. ఇలా ఎవరికీ తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఆ విశ్లేషణలేంటో చూద్దాం.

అంబటి రాయుడు ఉంటే..
టాపర్డర్‌ విఫలమైన సందర్భంలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఒక్కరు నిలిచున్నా ఫలితం వేరేలా ఉండేది. అయితే ఈ తరహా పరిస్థితుల్లో భారత్‌కు అండగా ఉండే బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో భారత్‌ 18 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో రాయుడే 90 పరుగులతో భారత స్కోర్‌బోర్డ్‌ను 250 దాటించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాయుడు ఉంటే భారత్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. దురదృష్టవశాత్తు ఈ ఇన్నింగ్స్‌ మన సెలక్టర్లకు గుర్తుకులేదని ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు. 

ధోని ముందు వచ్చి ఉంటే..
భారత్‌స్కోర్‌ 5/3 ఉన్న స్థితిలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు నీషమ్‌ అద్బుత క్యాచ్‌తో అతను వెనుదిరగడం భారత్‌ కొంపముంచింది. అయితే ఈ పరిస్థితుల్లో దూకుడుగా ఆడే హార్దిక్‌ పాండ్యాకు బదులు అనుభవం కలిగిన ధోనిని పంపించాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ధోని వచ్చి ఉంటే యువ క్రికెట్‌ రిషబ్‌ పంత్‌ను గైడ్‌ చేస్తూ.. సింగిల్స్‌తో ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించేవాడని, అప్పుడు భారత్‌ విజయం దిశగా పయనించేదని, చివర్లో పాండ్యా, జడేజా గెలుపు బాధ్యతలు తీసుకునేవారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఫీల్డింగ్‌..
భారత ఫీల్డింగ్‌లో స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ అలసత్వం కూడా కివీస్‌కు కలిసొచ్చింది. సునాయస ఫోర్లను ఆపకుండా చహల్‌ పరుగులిచ్చుకున్నాడు. ఇక కీవిస్‌ ఆటగాళ్లు మాత్రం అద్భుత ఫీల్డింగ్‌తో భారత బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ముఖ్యంగా పంత్‌, పాండ్యాల బ్యాటింగ్‌ అప్పుడు కష్టతరమైన బౌండరీలను కూడా ఆపి యువ ఆటగాళ్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఇక దినేశ్‌ కార్తీక్‌ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ నీషమ్‌ అద్భుత ఫీల్డింగ్‌తో అందిపుచ్చుకోవడం, గప్టిల్‌ విసిరిన బంతి నేరుగా వికెట్లు తాకి భారత ఆశలను కూల్చడం మ్యాచ్‌కే హైలైట్‌.

జట్టు కూర్పు..
కీలక సెమీస్‌ మ్యాచ్‌లో భారత జట్టు కూర్పు కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. 4 మ్యాచుల్లో 14 వికెట్లతో ఫామ్‌లో ఉన్న షమీని బెంచ్‌కు పరిమితం చేయడం.. ఇద్దరు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లనే మూసధోరణి పద్దతిలో బరిలోకి దిగడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. చహల్‌ బదులు షమీని జట్టులోకి తీసుకుంటే పేస్‌కు అచ్చొచ్చిన పిచ్‌పై ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ విభాగం మరింత తేలిపోయేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందరూ పొదుపుగా బౌలింగ్‌ చేయగా చహల్‌ ఒక్కడే 63 పరుగులు సమర్పించుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇక కివీస్‌ మాత్రం పిచ్‌ సరిగ్గా అంచనా వేసి ఒక్క స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌తోనే బరిలోకి దిగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top