
'ధోనికి అలా జరగడం దురదృష్టకరం'
పలు ఆరోపణల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గుడ్ బై చెప్పాల్సి రావడం నిజంగా దురదృష్టకరమని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అభిప్రాయపడ్డాడు.
న్యూఢిల్లీ: పలు ఆరోపణల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గుడ్ బై చెప్పాల్సి రావడం నిజంగా దురదృష్టకరమని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలంగా చట్టసమ్మతి ఉన్న కంపెనీపై ఒక వ్యక్తి ప్రభావం ఎంతమాత్రం ఉండదన్నాడు.
'రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అన్ని సందర్బాల్లో ఒకే రకంగా ఉండదు. కొన్ని సందర్బాల్లో అదే వ్యాపారం చాలా నిజాయితీగా సాగినా.. మరికొన్ని సందర్భాల్లో అంచనాలకు తగ్గట్టుగా ఉండదు. ఒక వ్యక్తి యావత్ సంస్థనే ప్రభావితం చేయలేడు. అటువంటప్పుడు ఆ సంస్థ నుంచి ధోని వైదొలగాలని డిమాండ్ రావడం దురదృష్టమే. ఒక సంస్థ ఇచ్చిన హామీలకు క్రికెటర్ ను టార్గెట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. గతంలో మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో కూడా అమితాబ్ బచ్చన్, మాధూరీ దీక్షిత్, ప్రీతి జింటాలపై కూడా ఇదే తరహాలో విమర్శలను చవిచూడాల్సి వచ్చింది'అని అనిల్ కపూర్ తెలిపాడు.
ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ధోని వైదొలగాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం మానుకోవాలని ధోనికి సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేయడంతో పాటు, ఆ సంస్థ ధోనీని దుర్వినియోగం చేసింది (#AmrapaliMisuseDhoni) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అమ్రాపాలి సంస్థ నుంచి ధోని ఆకస్మికంగా వైదొలిగాడు.