మా వాళ్ల ప్రవర్తన బాలేదు: బంగ్లా కెప్టెన్‌

What Happened After The Game Was Unfortunate, Akbar - Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్‌: అండర్‌-19 వరల్డ్‌కప్‌లో అజేయంగా సాగిన యువభారత్‌ ఆట అంతిమంగా పరాజయంతో ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో నెగ్గి కప్‌ను తొలిసారి గెలిచి కొత్త చాంపియన్‌గా అవతరించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లాదేశ్‌ బౌలర్‌ అవిషేక్‌ దాస్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత కప్‌ కొట్టేందుకు 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచి మెగాకప్‌ చరిత్రలో తన పేరును కూడా లిఖించుకుంది. (ఇక్కడ చదవండి: బంగ్లా, భారత్‌ ఆటగాళ్ల ఘర్షణ..!)

మ్యాచ్‌ తర్వాత బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ అక్బర్‌ అలీ మాట్లాడుతూ.. ‘ ‘మా కల నిజమైంది. గత రెండేళ్లుగా మేం చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. నేను క్రీజులోకి వెళ్లిన సమయంలో మాకో మంచి భాగస్వామ్యం అవసరముంది. నా సహచరులకు అదే చెప్పా. ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్‌ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే భారత్‌ అంత సులభంగా మమ్మల్ని గెలవనివ్వదనే విషయం మాకు తెలుసు. కఠినమైన ఛేదనే అయినా సాధించాం. కోచింగ్‌ బృందానికి ఎలా కృతజ్ఞత తెలపాలో అర్థం కావట్లేదు. మా బౌలర్లలో కొంత మంది ఉద్వేగంలో ఉన్నారు. విజయానంతరం మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తన అలా ఉండాల్సింది కాదు. మెగాకప్‌ గెలిచినా అంత అతి అవసరం లేదు. ఏదైతే జరిగిందో అది నిజంగా దురదృష్టకర ఘటన. భారత ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించాలి. టోర్నీ ఆసాంతం వారు అద్భుతంగా ఆడారు. మా విజయాన్ని కోరుకున్న వారందరికీ కృతజ్ఞతలు. ఇది మాకు ఆరంభం మాత్రమే. తర్వాత కూడా ఈ గెలుపు మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని తెలిపాడు.       

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top