ధోని ఆట ముగిసినట్లేనా!

We will Back Pant And Dhoni Is On Same Page With Selectors - Sakshi

భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామంటూ సెలక్టర్ల పరోక్ష సంకేతం

ముంబై: వరల్డ్‌ కప్‌ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని విషయంలో స్పష్టతనివ్వడంలో సెలక్టర్లు ఇప్పటి వరకు తడబడుతూ వచ్చారు. విశ్రాంతి అడిగాడని ఒక సారి, అతను కోరుకుంటే ఆడగలడని, ధోనిలాంటి గొప్ప క్రికెటర్‌ను ఏ జట్టయినా కోరుకుంటుందని... ఇలా ప్రతీ సారి ఏదో కప్పదాటు సమాధానాలే వారినుంచి వచ్చాయి. గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా మారిన మహత్యమో లేక నిజంగా ధోనినే తన గురించి చెప్పుకున్నాడో కానీ గురువారం అతని కెరీర్‌ గురించి మొదటి సారి సెలక్షన్‌ కమిటీ చెప్పుకోదగ్గ వివరణఇచ్చింది.

మాజీ కెప్టెన్ ఇక ఆటకు గుడ్‌బై చెప్పినట్లేనని ఈ మాటల సారాంశంగా కనిపిస్తోంది. ధోనిని దాటి తాము ఆలోచిస్తున్నామని సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.  ‘ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత మేం ఇక భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామని స్పష్టంగా చెబుతున్నా. రిషభ్‌ పంత్‌పై ప్రస్తుతం మేం ఎక్కువ దృష్టి పెట్టాం. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడంలో భాగంగానే పంత్‌తో పాటు ఇప్పుడు శామ్సన్‌ను కూడా ఎంపిక చేశాం. మా ప్రక్రియ మీకు అర్థమవుతోందని భావిస్తున్నా’ అని ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

తమ ఆలోచనలకు ధోని కూడా మద్దతిచ్చాడన్న చీఫ్‌ సెలక్టర్‌... రిటైర్మెంట్‌ అనేది వ్యక్తిగత నిర్ణయమని చెప్పడం విశేషం.‘కుర్రాళ్లను ప్రోత్సహించాలనే మా ఆలోచనను ధోని కూడా సమర్దించాడు.అతని భవిష్యత్తు గురించి కూడా మేం మాట్లాడాం. మహి మళ్లీ జట్టులోకి రావాలంటే అతనిష్టం. దేశవాళీ క్రికెట్‌ ఆడి టచ్‌లోకి వస్తాడా, రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తాడా అనేది పూర్తిగా వ్యక్తిగతం. అయితే మేం జట్టు భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక రూపొందించాం. దాని ప్రకారమే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాం’ అని ఎమ్మెస్కే వివరించారు. మరో వైపు ధోని జార్ఖండ్‌ అండర్‌–23 టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌ చేయనున్నట్లు సమాచారం.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top