
'తప్పిదాలను సరిచేసుకోవాలి'
భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో తిరిగి సత్తాచాటుకుంటామని న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాధమ్ స్పష్టం చేశాడు.
ధర్మశాల:భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో తిరిగి సత్తాచాటుకుంటామని న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాధమ్ స్పష్టం చేశాడు. తాము కొన్నింటిలో మెరుగుపడితే తప్పకుండా గట్టిపోటీ ఉంటుందన్నాడు. తొలి వన్డేతోనే సిరీస్ ముగిసి పోలేదని, ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నందున ఏమైనా జరగొచ్చన్నాడు. గత కొన్ని వారాల నుంచి భారత్లోని పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసినట్లు లాధమ్ తెలిపాడు. కాగా, దురదృష్టవశాత్తూ తొలి వన్డేలో పోరాడే స్కోరు చేయలేకపోవడంతోనే ఓటమి చెందామన్నాడు.
'మేము కొన్ని అనవసర తప్పిదాలు చేశాం. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చేసిన తప్పుల నుంచి బయట పడతామని అనుకుంటున్నా'అని లాధమ్ తెలిపాడు.తన సహచర ఆటగాడు టిమ్ సౌతీపై లాధమ్ ప్రశంసలు కురిపించాడు. తనకు సాయంగా నిలిచిన సౌతీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం నిజంగా మంచి పరిణామన్నాడు. జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సౌతీ అండగా నిలవడంతో 190 పరుగుల స్కోరును బోర్డుపై ఉంచకల్గిమన్నాడు.