మొన్న స్మిత్‌.. నేడు వార్నర్‌

Warner Becomes 12th Australian To Score 7000 Runs In Test cricket - Sakshi

పెర్త్‌: ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వేల పరుగుల మార్కును  చేరి వేగవంతంగా ఆ ఫీట్‌ను సాధించిన క్రికెటర్‌గా ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరొక ఆసీస్‌ క్రికెటర్‌, స్మిత్‌కు సన్నిహితుడు డేవిడ్‌ వార్నర్‌ కూడా ఏడువేల టెస్టు పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ ఈ మార్కును చేరాడు. మూడో రోజు ఆటలో 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా వార్నర్‌ ఏడు వేల టెస్టు పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 6,947 పరుగులతో ఉన్న వార్నర్‌.. కివీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు సాధించాడు.

అయితే ఏడువేల టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆసీస్‌ క్రికెటర్‌గా వార్నర్‌ నిలిచాడు. స్మిత్‌ ఈ ఫీట్‌ను సాధించిన తర్వాత వార్నరే ఆ ఘనత సాధించిన ఆసీస్‌ క్రికెటర్‌ కావడం గమనార్హం. ఇది వార్నర్‌కు 151వ ఇన్నింగ్స్‌. ఫలితంగా వేగవంతంగా ఏడువేల పరుగులు సాధించిన ఆసీస్‌ క్రికెటర్ల జాబితాలో ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు గ్రెయిగ్‌ చాపెల్‌తో కలిసి ఐదో స్థానంలో నిలిచాడు. ఈ ఫీట్‌ను స్మిత్‌ 126 ఇన్నింగ్స్‌ల్లో సాధించి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.  ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్‌ క్రికెటర్లు లబూషేన్‌(972), స్టీవ్‌ స్మిత్‌(857)లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, డేవిడ్‌ వార్నర్‌ ఆరో స్థానంలో ఉన్నాడు.

ఆసీస్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైంది.  ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ విజృంభించడంతో కివీస్‌ కుదేలైంది. కివీస్‌ ఆటగాళ్లలో రాస్‌ టేలర్‌(80) హాఫ్‌ సెంచరీ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆసీస్‌ బౌలర్ల దెబ్బకు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కివీస్‌ కనీసం రెండొంద పరుగుల మార్కును కూడా దాటలేకపోయింది. స్టార్క్‌ ఐదు వికెట్లతో న్యూజిలాండ్‌ పతానాన్ని శాసించాడు. టెస్టుల్లో స్టార్క్‌ ఐదు వికెట్లు తీయడం ఇది 13వసారి.109/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్‌ మరో 57 పరుగులు చేసి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు టేలర్‌ మినహా ఎవరూ రాణించలేదు. కివీస్‌ స్కోరు 120 పరుగుల వద్ద ఉండగా వాట్లింగ్‌(8) ఔట్‌ కావడంతో కివీస్‌ ఇక వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

టేలర్‌ ఏడో వికెట్‌గా, గ్రాండ్‌ హోమ్‌(23) ఎనిమిదో వికెట్‌ పెవిలియన్‌ చేరారు. జట్టు స్కోరు 166 పరుగుల వద్ద మిచెల్‌ సాంత్నార్‌(2), సౌథీ(8)లు ఔట్‌ కావడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  స్టార్క్‌కు జతగా నాథన్‌ లయన్‌ రెండు వికెట్లు తీయగా, హజిల్‌వుడ్‌, కమ్మిన్స్‌, లబూషేన్‌లు తలో వికెట్‌ తీశారు. అంతకుముందు ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. దాంతో కివీస్‌ను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం వచ్చినా ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అందుకు మొగ్గుచూపలేదు. రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించేందుకు ఆసక్తి చూపాడు. కివీస్‌ ముందు భారీ లక్ష్యాన్నా ఉంచాలనే ఉద్దేశంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top