
న్యూఢిల్లీ: పురుషుల క్రికెటర్ల గురించి ప్రస్తావిస్తేనే చిర్రుబుర్రులాడే భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ తొలి సారి కెప్టెన్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లి తనకు స్పూర్తిని కలిగిస్తున్నాడని ఓ జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో తెలిపారు.
తన కెరీర్ తొలిరోజుల్లో మహిళల క్రికెట్‌కు అంతగా ఆదరణ లేదని, కానీ ఇప్పడు మహిళా క్రికెటర్లను గుర్తించి గౌరవించడం సంతోషంగా ఉందని మిథాలీ పేర్కొన్నారు. క్రికెట్ శకం మొదలైన సమయంలోనే అరంగేట్రం చేసినప్పటికి అంతగా గుర్తింపు దక్కలేదన్నారు. ఇక తనపై చేసే విమర్శలపై స్పందిస్తూ కాలాన్ని వృథా చేసుకోదలుచులేనని స్పష్టం చేశారు.
ప్రతి రోజు ఎంతో మంది నాకు స్తూర్తిని కలిగిస్తారు. వారిలో ఒకరి గురించి చెప్పాలంటే అది విరాట్ కోహ్లినే అని, తన ఫిట్‌గా ఉంటూ.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ఆసక్తి కలిగించాడని మిథాలీ తెలిపారు. క్రికెట్‌లో పురుషులకైనా, మహిళలకైనా ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని మిథాలీ చెప్పుకొచ్చారు.
ఇక 2017 మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరి ఇంగ్లండ్ చేతిలో ఓడినప్పటికి అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే. ఇక బీబీసీ శక్తివంతమైన మహిళల జాబితాలో కూడా మిథాలీ స్థానం సంపాదించుకున్నారు.