పాండ్యా నాటౌట్‌..! చిర్రెత్తిన కోహ్లీ | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 18 2018 12:38 PM

Virat Kohli Gets Angry And Shook His Head On Umpire Decision - Sakshi

ముంబై: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కోపమొచ్చింది. హార్దిక్‌ పాండ్యా ఔటైనా నాటౌట్‌గా ప్రకటించారంటూ అతడు అసహనానికి గురయ్యాడు. ఫీల్డ్‌ అంపైర్‌ని కలిసి ఇదేంటని ప్రశ్నించాడు. ఈ సంఘటన ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ జట్టు  20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికి కీరన్‌ పొలార్డ్‌ ఔటవడంతో హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చాడు. అదే ఓవర్‌లో వోక్స్‌ వేసిన మరో బంతికి హార్దిక్‌ క్యాచ్‌ ఔట్‌ అంటూ ఆర్సీబీ అప్పీల్‌ చేయడం ఫీల్డ్‌ అంపైర్‌ వేలెత్తడం చకచక జరిగిపోయాయి.

అయితే దీనిపై రివ్యూ కోరిన ముంబై ఇండియన్స్‌ జట్టుకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. థర్డ్‌ అంపైర్‌ హార్దిక్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. హార్దిక్‌ నాటౌట్‌ అంటూ బిగ్‌ స్ర్కీన్‌పై చూసిన కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌ దగ్గరికి వెళ్లి ఆరా తీశాడు. మైదానంలో కూల్‌గా వ్యవహరించే కోహ్లీ ఈ నిర్ణయం సరైంది కాదని అడ్డంగా తల ఊపుతూ.. అసహనం వ్యక్తం చేశాడు. అయితే స్టికో మీటర్‌లో సైతం బంతి పాండ్యా బ్యాట్‌ అంచును తాకుతూ వెళ్లినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 46 పరుగుల తేడాతో బెంగుళూరుపై ఘన విజయం సాధించింది. ముంబైకి ఈ సీజన్‌లో ఇదే తొలి విజయం కావడం విశేషం.

Advertisement
Advertisement