నిదాహస్‌ ట్రోఫీయే నాకు బుద్ధి చెప్పింది : శంకర్‌

Vijay Shankar Says Not thinking about World Cup - Sakshi

నాగ్‌పూర్‌ : చివరి ఓవర్లో అదరగొట్టి ఆస్ట్రేలియా విజయానికి అడ్డుకట్టవేసిన టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఈ తరహా ప్రదర్శనకు కారణం గతేడాది జరిగిన నిదాహస్‌ ట్రోఫీ ట్రోఫియేనని అభిప్రాయపడ్డాడు. ఆ టోర్నీ వల్లే తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం నాగ్‌పూర్‌ వేదికగా ఆతిథ్య ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 8 పరుగుల తేడాతో గెలుపొంది.. 500వ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చిన విజయ్‌ శంకర్‌.. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌ బెర్త్‌ గురించి ఆలోచించడం లేదని, కేవలం తన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టానన్నాడు. 

‘నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను.. ప్రపంచకప్‌ సెలక్షన్‌ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నాకు ప్రతి మ్యాచ్‌ ముఖ్యమే. నేను కేవలం జట్టు గెలుపుకు తన నుంచి ఇవ్వాల్సిన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే.. నిదాహస్‌ ట్రోఫీ నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. ఆ టోర్నీ తర్వాతే ఒత్తిడిలో ఎలా ఉండాలో తెలిసింది. అన్నివేళలో ప్రశాంతంగా ఉండాలనే తత్వం బోధపడింది. తాజా మ్యాచ్‌లో ఏ సమయంలోనైనా బౌలింగ్‌ చేయాడనికి మానసికంగా సిద్ధమయ్యాను. 44 ఓవర్లనంతరం ఎప్పుడైనా బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉండాలని, అది చివరి ఓవరైనా చాలెంజ్‌కు సిద్ధంగా ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. చివరి ఓవర్లో బుమ్రా మెళుకువలు కలిసొచ్చాయి. క్లబ్‌ క్రికెట్‌లో తప్పా నేనెప్పుడూ చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేయలేదు. చివరి ఓవర్లో రెండు వికెట్లు దక్కడంతో పొంగిపోలేదు. కేవలం ఆ మూమెంట్‌ను ఆస్వాదించాను. రనౌట్‌ కావడం క్రికెట్‌లో సర్వసాధారణం. ఆ సమయంలో మళ్లీ క్రీజులోకి వేళ్లే అవకాశం లేదు. దీనిని ఏదో నేను దురదృష్టం అనుకోను.’  అని ఈ తమిళనాడు క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి : శంకరన్నా.. సూపరన్నా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top