
బెంగళూరు: అన్ని రంగాల్లో ఆధిపత్యం చాటిన భారత్ ‘ఎ’ జట్టు దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకుంది. 338 పరుగులు వెనుకబడి సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ను హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (4/18) హడలెత్తించాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆటకు మంగళవారం చివరి రోజు. ఓవర్‌నైట్ స్కోరు 411/2తో సోమవారం బరిలో దిగిన భారత్ ‘ఎ’... 584/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (220) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరిగాడు.ఆంధ్ర బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (54; 3 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ సిరాజ్ ప్రతాపంతో ఆరు పరుగులకే ఎర్వీ (3), మలాన్ (0), జొండొ (0)ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హమ్జా (46 బ్యాటింగ్), ముత్తుస్వామి (41) నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆట ముగిసే సమయంలో సిరాజ్... ముత్తుస్వామిని ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు.