నం.4కు రాహుల్‌ అర్హుడు: వెంగ్‌సర్కార్‌

Vengsarkar Feels Trying Out Rahul At No4 Is An Option India - Sakshi

ముంబై: ఇంగ్లండ్‌ వేల్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో కేఎల్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని టీమిండియా మాజీ ఛీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డాడు. ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి సేన ప్రపంచకప్‌లో సత్తా చాటుతుందన్నాడు. ఇంగ్లండ్‌ పరిస్థితులతో పాటు రాహుల్‌ టెక్నిక్‌ దృష్ట్యా నంబర్‌ 4లో అతన్ని బరిలోకి దించే విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పరిశీలించాలన్నాడు. గత కొన్నాళ్లుగా నాలుగో స్థానంలో ఆడిన తెలుగు తేజం రాయుడు ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. దీంతో భారత క్రికెట్‌ వర్గాల్లో అందరి చర్చ నాలుగో స్థానం చుట్టూనే తిరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ వెంగ్‌సర్కార్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ధావన్, రోహిత్‌ శర్మల రూపంలో మనకు స్థిరమైన ఓపెనింగ్‌ జోడీ అందుబాటులో ఉంది. ఇక కోహ్లి మూడో స్థానంలో దిగుతాడు. దీంతో నంబర్‌ 4 కోసం విజయ్‌ శంకర్‌ బదులు డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ను పరిశీ లించాలి. బ్యాటింగ్‌లో అతని సాంకేతికత, ఆటతీరులో నిలకడ జట్టుకు ఉప యోగపడుతుంది’ అని అన్నాడు. 1979, 1983,1987లలో మూడు ప్రపంచకప్‌లు ఆడిన ఈ మాజీ దిగ్గజం... రెండు ప్రపంచకప్‌లు ఇంగ్లండ్‌లోనే ఆడాడు. స్పెషలిస్ట్‌ ఓపెనర్‌ అయిన రాహుల్‌కు ఆరంభంలో వికెట్లు కోల్పోతే జట్టును ఆదుకునే సామర్థ్యం ఉందని, పైగా సుదీర్ఘమైన ఈ వన్డే ప్రపంచకప్‌లో అతన్ని అవసరమైతే ఓపెనింగ్‌లోనూ దించవచ్చని సూచించాడు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో 593 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచిన అతనికి తప్పకుండా తుది జట్టులో అవకాశమివ్వాలన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌లో పర్యటించిన అనుభవం భారత జట్టుకు దోహదం చేయగలదని ఈ 63 ఏళ్ల దిగ్గజ ఆటగాడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో రాణించలేకపోయిన స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లు తమ బౌలింగ్‌ను మెరుగు పర్చుకోవాలన్నారు. త్వరలో జరిగే ప్రపంచకప్‌లో భారత్, ఆతిథ్య ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరతాయని, మరో జట్టుపై ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top