
సాక్షి, హైదరాబాద్: సీకే క్లాసిక్ ఇంటర్నేషనల్ ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. మలేసియాలో మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర క్రీడాకారులు ఆరు పతకాలను సాధించారు. మొత్తం 22 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడగా... తెలంగాణ క్రీడాకారులు రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
ఇ. వేదాంత్ రెడ్డి, మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించారు. పి. సాయి కిరణ్, పవన్ కుమార్, ఓంకార్, చంద్ర కుమార్ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి దేశం గర్వించదగిన క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.