ద్యుతీ యూఆర్‌ ట్రూ చాంపియన్‌: తెలుగు డైరెక్టర్‌

Tollywood Directed Praises To Sprinter Dutee Chand - Sakshi

హైదరాబాద్‌ : అమ్మాయితో సహజీవనం చేస్తున్నాని ప్రకటించిన భారత స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌పై టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ ప్రశంసలు కురిపించాడు. ద్యుతీ చంద్‌పై ప్రముఖ స్పోర్ట్స్‌ చానెల్‌ రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్‌.. ద్యుతీని కొనియాడాడు. అయితే మూడు రోజుల క్రితమే తన రిలేషన్‌ గురించి ద్యుతీ బాహటంగా ప్రకటించినప్పటికీ.. మూడేళ్ల క్రితమే ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు సదరు స్పోర్ట్స్‌ చానెల్‌ పేర్కొంది. ప్రేమకు జెండర్‌తో పనిలేదని, మనసులు కలిస్తే చాలని 2016లోనే ద్యుతీ చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. అప్పటికి భారత్‌లో స్వలింగ సంపర్కం నేరమని, అయినా తన సహచర్యం గురించి తెలిపిందని ప్రస్తావించింది. ఆమె తన ఆట కోసం ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా వివరించింది. ఈ కథనానికి ముగ్ధుడైన రాహుల్‌.. ట్విటర్‌ వేదికగా ద్యుతీని ఆకాశానికెత్తాడు. ఈ కథనం చాలా స్పూర్తిదాయకంగా ఉందని, ఆమె తనకు ఎదురైన సమస్యలను అధిగమించి పోటీలో నిలవడం గొప్ప విషయమని, ‘ద్యుతీ యూ ఆర్‌ ట్రూ చాంపియన్‌’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం రాహుల్‌.. కింగ్‌ నాగర్జున హీరోగా మన్మథుడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 2002లో కె. విజయభాస్కర్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌ అని తెలిసిందే.

ఇక ద్యుతీ సహజీవనాన్ని ఆమె కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ద్యుతీ తల్లి, సోదరి మీడియా వేదికగా ఆమెను తప్పుబడుతూ కెరీర్‌ విషయంపై ఆందోళన వ‍్యక్తం చేశారు.  ద్యుతీ మాత్రం ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తన ప్రియురాలితో బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top