
నేటి నుంచి యాషెస్ తొలి టెస్టు
‘హ్యాట్రిక్’ సిరీస్ విజయాల జోరులో ఇంగ్లండ్... చెత్త రికార్డును నమోదు చేయకూడదనే లక్ష్యంతో ఆస్ట్రేలియా...
బ్రిస్బేన్: ‘హ్యాట్రిక్’ సిరీస్ విజయాల జోరులో ఇంగ్లండ్... చెత్త రికార్డును నమోదు చేయకూడదనే లక్ష్యంతో ఆస్ట్రేలియా... ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక ‘యాషెస్ సిరీస్’కు గురువారం తెరలేవనుంది. బ్రిస్బేన్‌లోని ‘గబ్బా’ మైదానంలో మొదలయ్యే ఈ తొలి టెస్టులో ఫామ్ పరంగా ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... ఈ మైదానంలో తమకున్న రికార్డు ప్రకారం ఆస్ట్రేలియానూ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. 2009, 2010-11, 2013లలో యాషెస్ సిరీస్‌లను సొంతం చేసుకొని ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ఇంగ్లండ్ ఈసారీ నెగ్గితే 123 ఏళ్ల తర్వాత మరోసారి... వరుసగా నాలుగు అంతకంటే ఎక్కువ యాషెస్ సిరీస్‌లు సొంతం చేసుకున్న ఘనతను సాధిస్తుంది.
మూడు నెలల క్రితమే ఇంగ్లండ్‌లో ముగిసిన యాషెస్ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్ అలాంటి ఫలితాన్నే పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు 1988 నుంచి ‘గబ్బా’ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు పరాజయం ఎదురుకాలేదు. ఓవరాల్‌గా ఈ మైదానంలో ఆస్ట్రేలియా 55 టెస్టులు ఆడి 33 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా... ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయి... 13 మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించింది.