
ముంబై: వచ్చే నెల 14 నుంచి రష్యాలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ సమరంలో విజేత ఎవరనే దానిపై క్రమంగా అంచనాలు మొదలవుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీతో పాటు ఫ్రాన్స్, స్పెయిన్‌లకు ఈసారి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా. అయితే అతడు బెల్జియంను డార్క్ హార్స్‌గా పేర్కొంటూ ఆ జట్టుపైనా నమ్మకం ఉంచాడు. ‘జర్మనీ, ఫ్రాన్స్ ఫేవరెట్లే. ప్రతిభావంతులున్న బెల్జియం నన్ను ఆశ్చర్యపరుస్తోంది’ అని పేర్కొన్నాడు.
ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా మంగళవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భూటియా పాల్గొన్నాడు. ఆతిథ్య రష్యా అవకాశాలపై మాట్లాడుతూ... ‘గ్రూప్ దశ దాటించగల ఆటగాళ్లున్న ఆ జట్టు రాణిస్తుంది. ప్రి క్వార్టర్స్‌కు చేరుతుంది. స్పెయిన్‌కు ఎప్పుడైనా కప్ గెలిచే సామర్థ్యముంది’ అని విశ్లేషించాడు. 1986 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై అర్జెంటీనా సాకర్ దిగ్గజం డిగో మారడోనా చేసిన గోల్ తనకు మధుర జ్ఞాపకమని భూటియా చెప్పాడు.