World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు వేల్స్‌ జట్టు అర్హత

World Cup 2022: Celebrations as Wales qualify after 64-year wait - Sakshi

కార్డిఫ్‌: ఎప్పుడో 1958లో... వేల్స్‌ ఫుట్‌బాల్‌ జట్టు ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో అప్పుడు 17 ఏళ్ల వయసు ఉన్న ఆల్‌టైమ్‌ గ్రేట్‌ పీలే (బ్రెజిల్‌) చేసిన ఏకైక గోల్‌తో వేల్స్‌ పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో 15 ప్రపంచకప్‌లు జరిగినా... ఒక్కసారి కూడా వేల్స్‌ అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆ టీమ్‌కు విశ్వవేదికపై తలపడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగే ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌కు వేల్స్‌ అర్హత పొందింది.

క్వాలిఫయర్స్‌ పోరులో వేల్స్‌ 1–0 తేడాతో ఉక్రెయిన్‌పై విజయం సాధించింది. ఉక్రెయిన్‌ ఆటగాడు ఆండ్రీ యర్మొలెంకో 34వ నిమిషంలో చేసిన ‘సెల్ఫ్‌ గోల్‌’తో వేల్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. వేల్స్‌ స్టార్‌ ఆటగాడు, ఐదుసార్లు చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ విజయాల్లో భాగమైన గారెత్‌ బేల్‌ ఈ విజయాన్ని ‘తమ ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యుత్తమ ఫలితం’గా అభివర్ణించాడు. బేల్‌ కొట్టిన ఫ్రీకిక్‌ను హెడర్‌తో దిశ మళ్లించే ప్రయత్నంలోనే విఫలమై యర్మొలెంకో బంతిని తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అమెరికా, ఇరాన్‌ ఉన్న గ్రూప్‌ ‘బి’లో వేల్స్‌ పోటీ పడనుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top