బంగ్లాదేశ్‌ బెంబేలు..!

Third New Zealand-Bangladesh Test called off after Christchurch attack - Sakshi

తీవ్రవాద దాడితో వణికిపోయిన క్రికెటర్లు

ఘటన నుంచి త్రుటిలో తప్పించుకున్న జట్టు

న్యూజిలాండ్‌ పర్యటన రద్దు   

సరిగ్గా పదేళ్ల క్రితం 3 మార్చి, 2009... లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని టీమ్‌ బస్సుపై తుపాకులతో దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఆటగాళ్లు ప్రాణాలతో బయటపడ్డా ఆ భయం సుదీర్ఘ కాలం పాటు వారిని వీడలేదు. ఈసారి క్రైస్ట్‌చర్చ్‌ మసీదులో లక్ష్యం క్రికెటర్లు కాకపోవచ్చు... కానీ క్షణాల వ్యవధిలో ప్రాణాలు దక్కించుకున్న బంగ్లాదేశ్‌ క్రికెటర్లను అడిగితే తెలుస్తుంది ఆ సమయంలో వారి గుండెలు ఎలా కొట్టుకున్నాయో! అందుబాటులో ఉన్న దారి నుంచి పరుగెత్తి స్టేడియం చేరుకునే వరకు వారి ఒక్కో అడుగులో ప్రాణభయం కనిపించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో శనివారం నుంచి
జరగాల్సిన మూడో టెస్టును రద్దు చేసుకొని బంగ్లాదేశ్‌ స్వదేశం పయనమైంది. 

క్రైస్ట్‌చర్చ్‌: మసీదులో తీవ్రవాదులు జరిపిన దాడి నుంచి బంగ్లాదేశ్‌ క్రికెటర్లు త్రుటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన మస్జిద్‌ అల్‌ నూర్‌లోకి ఆ జట్టు ఆటగాళ్లు ప్రవేశించబోతున్న సమయంలోనే అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. అప్పటికి వారంతా టీమ్‌ బస్సులోనే ఉన్నారు. అయితే బస్సులోనే ఉండిపోతే నేరుగా తమపైనే దాడి జరగవచ్చని భావించిన వారంతా వెంటనే దిగేసి తలో దారి చూసుకున్నారు. ఎవరికి వారు విడివిడిగా స్టేడియం వైపు పరుగులు తీశారు. భయంతో వణికిపోతూనే ముందుగా తాము ప్రాక్టీస్‌ చేస్తున్న హాగ్లీ ఓవల్‌ స్టేడియానికి పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడి నుంచి హోటల్‌ గదుల్లోకి వెళ్లిపోయారు. అనంతరం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుతో బంగ్లాదేశ్‌ బోర్డు చర్చించిన అనంతరం మిగిలిన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అనుమతినిచ్చింది.  

ఏం జరిగిందంటే... 
బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ఆడుతు న్న మ్యాచ్‌లను కవర్‌ చేస్తూ న్యూజిలాండ్‌లోనే ఉన్న సీనియర్‌ జర్నలిస్ట్‌ మొహమ్మద్‌ ఇసామ్‌ కథనం ప్రకారం... శనివారం నుంచి బంగ్లా, కివీస్‌ మధ్య మూడో టెస్టు జరగాల్సి ఉంది. దీనికి ముందు శుక్ర వారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనేందుకు బంగ్లా హాగ్లీ ఓవల్‌ గ్రౌండ్‌కు వచ్చింది. అయితే వర్షం కారణంగా మైదానం పరిస్థితి బాగా లేదు. మైదానానికి దగ్గరలోనే మసీదు ఉండటంతో ఇండోర్‌ ప్రాక్టీస్‌కు ముందు తాము శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని ఆటగాళ్లు చెప్పారు. దాంతో టీమ్‌ బస్సులో సహాయక సిబ్బందితో కలిసి మొత్తం 17 మంది అక్కడకు వెళ్లారు. వారు మసీదుకు చేరువగా వెళ్లినా ఇంకా బస్సు దిగలేదు. కొద్దిసేపటికే బంగ్లా బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ‘ఇక్కడ ఫైరింగ్‌ జరుగుతోంది. మమ్మల్ని రక్షించండి’ అంటూ ఆ జర్నలిస్ట్‌కు ఫోన్‌ చేశాడు. ముందుగా హాస్యమాడుతున్నాడని అనుకున్నా తర్వాత ఫో¯Œ లో తీవ్రత అర్థమయ్యాక అతను మసీదు వైపు పరుగెత్తుకు వెళ్లాడు. ఆ సమయంలో అప్పటికే కాల్పులు జరగడంతో పరిస్థితి దారుణంగా ఉంది. ఆటగాళ్లంతా బస్సు వైపు వెళ్లకుండా మరోవైపు పరుగెత్తడం కనిపించింది. చాలా మంది ఆటగాళ్లే తీవ్రవాదుల లక్ష్యం కావచ్చని కూడా భావించారు. క్రికెటర్లంతా ఒక్కసారిగా కనిపించిన వారిని హాగ్లీ ఓవల్‌ మైదానానికి దారి ఎటు అని అడుగుతూ అటువైపు పరుగెత్తారు. అప్పటికే కళ్ల ముందు రక్తపాతాన్ని చూసిన వారందరూ భయంతో వణుకుతూనే ఏదోలా స్టేడియం లోపలికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు వారిని సురక్షితంగా హోటల్‌కు పంపించారు.   

కొంత ముందుగా వెళ్లి ఉంటే... 
దేవుడి దయ వల్ల తాము పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని బంగ్లాదేశ్‌ మేనేజర్‌ ఖాలెద్‌ మసూద్‌ అన్నాడు. ‘మేం ఆ సమయంలో మసీదుకు దాదాపు 50 గజాల దూరంలో ఉన్నాం. అప్పుడే జనాలు రక్తమోడుతున్న దృశ్యాలు కళ్ల ముందు కనిపించాయి. అంత భయంలో కూడా మా బుర్ర పని చేసింది. అందుకే బస్సు దిగి వేగంగా పరుగెత్తాం. లేదంటే ఇంకా ఏమైనా జరిగేదేమో. మరో మూడు, నాలుగు నిమిషాల ముందు మసీదుకు వెళ్లినా బాధితుల్లో మేం కూడా ఉండేవాళ్లం’ అని మసూద్‌ ఘటనను వివరించాడు. 

షూటర్ల బారినుంచి మా జట్టు మొత్తం తప్పించుకోగలిగింది. ఇదో భయంకర అనుభవం.
– తమీమ్‌ ఇక్బాల్, బంగ్లా క్రికెటర్‌  

దేవుడే రక్షించాడు. మేం చాలా అదృష్టవంతులం. జీవితంలో మళ్లీ ఇలాంటి ఘటన జరగకూడదు.
– ముష్ఫికర్‌ రహీమ్, బంగ్లా క్రికెటర్‌ 

ఎన్నో ఏళ్లుగా మా దేశంలో ఎన్నో పెద్ద ఈవెంట్‌లు జరిగాయి. అందరికంటే భిన్నంగా, ప్రశాంతంగా మాదైన చిన్న ప్రపంచంలో బతుకుతున్నామని భావించా. కానీ ఇది చాలా బాధాకరమైన రోజు. దీనిని మాటల్లో చెప్పలేను. 
– జిమ్మీ నీషమ్, న్యూజిలాండ్‌ క్రికెటర్‌  

విషాద ఘటనతో తీవ్రంగా నిర్ఘాంతపోయాను. బంగ్లాదేశ్‌ టీమ్‌ గురించి ఆందోళనకు లోనయ్యా. మరణించినవారి గురించి ఎంతో బాధగా ఉంది. 
– విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌ 

న్యూజిలాండ్‌ ప్రశాంతమైన దేశం. ఈ ఘటన ఎంతో విషాదకరం. తమీమ్‌తో మాట్లాడాక మనసు కుదుటపడింది.
– షాహిద్‌ అఫ్రిది, పాక్‌ మాజీ ఆటగాడు   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top