వారిద్దరూ టెస్టులకు సిద్ధం!  | Sakshi
Sakshi News home page

వారిద్దరూ టెస్టులకు సిద్ధం! 

Published Sat, Jul 14 2018 1:27 AM

They both prepare for the test match - Sakshi

తొలి వన్డేలో భారత్‌ అద్భుత ప్రదర్శనను చూసిన తర్వాత రాబోయే రెండు వన్డేల్లో ఏం చేయాలనే దానిపై ఇంగ్లండ్‌ వ్యూహ బృందం తలలు బద్దలు కొట్టుకోవాల్సిందే. గత ఐదేళ్లలో 300 పరుగులకంటే ఎక్కువగా సగటు స్కోరు నమోదైన పిచ్‌పై ఇంగ్లండ్‌ 268కే పరిమితమైంది. అదీ భారత్‌కు చెందిన ఇద్దరు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా లేకుండా ఇది జరిగింది. అసలు మ్యాచ్‌ గెలవాలంటే ఎన్ని పరుగులు చేయాల్సి ఉంటుందోనని ఇంగ్లండ్‌ సుదీర్ఘంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఏమాత్రం చప్పుడు చేయని సూపర్‌ కార్‌ తరహాలో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ కనిపిస్తుంది. అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు అతడిని పక్కన పెట్టారు కానీ తన బ్యాటింగ్‌తో అతను మళ్లీ టెస్టుల్లోకి ఎంపికయ్యే విధంగా ఆడుతున్నాడు.

ఇక కుల్దీప్‌ టెస్టుల్లో కూడా తనకు చోటు కల్పించవచ్చని తన ఆటతో నిరూపించాడు. భారత బ్యాటింగ్‌కంటే కూడా కుల్దీప్‌ స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలనేదే ఇంగ్లండ్‌కు పెద్ద సమస్యగా మారింది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టడం అంటే బ్యాటింగ్‌లో 150కి పైగా పరుగులు చేయడంతో సమానం. రోహిత్‌ రెండు సెంచరీలలాగే కుల్దీప్‌ రెండు సార్లు ఐదు వికెట్లు పడగొట్టడం టెస్టుల్లో అతనికి అవకాశం కల్పించవచ్చు. ప్రస్తుతం తీవ్రంగా ఎండ ఉంటోంది కాబట్టి స్పిన్‌కు బాగా అనుకూలిస్తోంది. భారత్‌ను ఎలా నిలువరించాలో ఇంగ్లండ్‌ తొందరగా కనిపెట్టకపోతే వన్డే సిరీస్‌ కూడా టి20 సిరీస్‌లాగే ముగియడం ఖాయం.    

Advertisement
Advertisement