మిషన్‌ ఆసీస్‌ దిగ్విజయం

Team India Wins Melbourne Match By 7 Wickets, Series By 2-1 - Sakshi

చివరి వన్డేలో భారత్‌ ఘనవిజయం

2–1తో సిరీస్‌ సొంతం

7 వికెట్లతో ఆస్ట్రేలియా చిత్తు

చహల్‌కు 6 వికెట్లు  

ధోని, జాదవ్‌ అర్ధ సెంచరీలు  

టెస్టుల్లో తొలిసారి అద్భుత రీతిలో సిరీస్‌ సొంతం... వర్షం అడ్డురాకపోతే టి20 సిరీస్‌ కూడా మన ఖాతాలో చేరేదే... ఇప్పుడు మొదటి సారి వన్డే సిరీస్‌ సైతం దక్కింది... గతంలో ఏ భారత జట్టుకూ సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన చేసి చూపిస్తూ ఆస్ట్రేలియా నుంచి అజేయంగా తిరిగొచ్చింది. కంగారూ గడ్డపై ఒకే పర్యటనలో ఏ ఫార్మాట్‌లోనూ సిరీస్‌ ఓడని తొలి విదేశీ జట్టుగా ఘనత సాధించింది. వరల్డ్‌ కప్‌ సన్నాహకాల బాటలో మరపురాని విజయం భారత్‌ సొంతమైంది. 

టి20 టీమ్‌తో పాటు ఆస్ట్రేలియా వచ్చిన యజువేంద్ర చహల్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాకుండానే తిరిగి వెళ్లిపోయాడు. వన్డే టీమ్‌తో చేరాక తొలి రెండు మ్యాచ్‌లకు చోటుదక్కలేదు. కానీ తనకు దక్కిన ఒకే ఒక్క చాన్స్‌ను అతను అద్భుతంగా వాడుకున్నాడు. 6 వికెట్లతో ఆసీస్‌ పని పట్టి టీమిండియా విజయానికి బాటలు వేశాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో పాటు ఆసీస్‌ గడ్డపై ఒక బౌలర్‌ అత్యుత్తమ గణాంకాలను అతను సమం చేశాడు. 

వరుసగా మూడు వన్డేల్లో మూడు అర్ధసెంచరీలు... నా నుంచి ఇంకా ఏం ఆశిస్తారు అన్నట్లుగా విమర్శకులకు తన బ్యాట్‌తోనే మహేంద్ర సింగ్‌ ధోని సమాధానం చెప్పిన తీరు ఈ సిరీస్‌కే హైలైట్‌. ఛేదనలో చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించడంలో తన అద్భుత రికార్డును నిలబెట్టుకుంటూ మహి మాయ చేశాడు. లక్ష్యం చిన్నదే అయినా పరిస్థితులకు తగినట్లుగా తన ఆటను మార్చుకుంటూ మరో విజయాన్ని అందించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు.   

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ ఘనమైన ముగింపునిచ్చింది. కంగారూ టూర్‌లో టీమిండియా విసిరిన ఆఖరి పంచ్‌ సరిగ్గా లక్ష్యాన్ని తాకింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం మరోసారి తమ సత్తాను ప్రదర్శించింది. శుక్రవారం మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరిగిన చివరి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రే లియా 48.4 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటైంది. పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (63 బంతుల్లో 58; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షాన్‌ మార్ష్‌ (54 బంతుల్లో 39; 3 ఫోర్లు), ఉస్మాన్‌ ఖాజా (51 బంతుల్లో 34; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత లెగ్‌ స్పిన్నర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యజువేంద్ర చహల్‌ 42 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం భారత్‌ 49.2 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసి గెలిచింది. ధోని (114 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌ (57 బంతుల్లో 61 నాటౌట్‌; 7 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 121 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. కోహ్లి (62 బంతుల్లో 46; 3 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సిరీస్‌లో ధోని మొత్తం 193 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం అందుకున్నాడు. పలు క్యాచ్‌లు, రనౌట్‌ అవకాశాలు వృథా చేసి ఆస్ట్రేలియా చేజేతులా మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది.  

‘చహల్‌’చల్‌... 
టాస్‌ గెలిచిన భారత్‌ తేమను దృష్టిలో ఉంచుకొని ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మూడు మార్పులు చేసిన జట్టు కుల్దీప్, రాయుడు, సిరాజ్‌ స్థానాల్లో చహల్, జాదవ్, విజయ్‌ శంకర్‌లకు అవకాశం ఇచ్చింది. 5 టి20లు ఆడిన విజయ్‌కు ఇది తొలి వన్డే కావడం విశేషం. వర్షంతో మ్యాచ్‌ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కాగా... రెండు బంతులకే మళ్లీ వాన రావడంతో మరో 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. తన రెండో ఓవర్లోనే అలెక్స్‌ క్యారీ (5)ని ఔట్‌ చేసి శుభారంభం అందించిన భువనేశ్వర్‌... కొద్ది సేపటికే ఫించ్‌ (14) ఆట కూడా ముగించాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆసీస్‌ కెప్టెన్‌ భువీ బౌలింగ్‌లోనే ఔట్‌ కావడం గమనార్హం. ఈ దశలో ఖాజా, మార్ష్‌ కలిసి అతి జాగ్రత్తగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 11 పరుగుల వద్ద మార్ష్‌ ఇచ్చిన క్యాచ్‌ను ధోని వదిలేశాడు. అయితే చహల్‌ రంగప్రవేశంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొదటి స్పెల్‌లో మూడు వికెట్లు తీసిన అతను, తన రెండో స్పెల్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టాడు. చహల్‌ తొలి ఓవర్లోనే మార్ష్‌, ఖాజా వెనుదిరిగారు. ఆ తర్వాత మరో చక్కటి బంతికి స్టొయినిస్‌ (10)ను కూడా చహల్‌ ఔట్‌ చేశాడు. మరో ఎండ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌ మాత్రం కొంత పోరాడే ప్రయత్నం చేసినా ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి అతనికి సహకారం లభించలేదు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మ్యాక్స్‌వెల్‌ (19 బంతుల్లో 26; 5 ఫోర్లు)... షమీ బౌలింగ్‌లో భువీ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత మళ్లీ చహల్‌ జోరు మొదలైంది. రిచర్డ్‌సన్‌ (16)ను ఔట్‌ చేసిన అనంతరం హ్యాండ్స్‌కోంబ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.  

భారీ భాగస్వామ్యం... 
స్వల్ప లక్ష్యమే అయినా పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా భారత బ్యాట్స్‌మెన్‌కు పరుగులు అంత సులువుగా రాలేదు. ఫలితంగా చివరి ఓవర్లోనే విజయం సాధ్యమైంది. వ్యక్తిగత స్కోరు 1 వద్ద ‘రివ్యూ’ ద్వారా ఎల్బీగా ఔట్‌ కాకుండా తప్పించుకున్నా... రోహిత్‌ శర్మ (9) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 14 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో హ్యాండ్స్‌కోంబ్‌ వదిలేయగా, ఆరంభం నుంచి తడబడ్డ  ధావన్‌ (46 బంతుల్లో 23) చివరకు స్టొయినిస్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్‌ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో ధోని ‘డకౌట్‌’ కాకుండా బయట పడ్డాడు. ధోని 34 వద్ద ఉన్నప్పుడు సిడిల్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడగా పాయింట్‌లో మ్యాక్స్‌వెల్‌ క్యాచ్‌ పట్టాడు. అయితే ఆసీస్‌ గట్టిగా అప్పీల్‌ చేయలేదు. రీప్లేలో బంతి ధోని బ్యాట్‌కు తగిలిందని తేలడంతో ఆసీస్‌ మరో అవకాశం కోల్పోయింది. చివరకు కోహ్లిని రిచర్డ్‌సన్‌ ఔట్‌ చేయడంతో 54 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ ముగిసింది. ధోని, కోహ్లి భాగస్వామ్యం 82 బంతుల పాటు సాగగా... కోహ్లి 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు! ఈ దశలో జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్న ధోని, జాదవ్‌ జోడి చివరి వరకు అజేయంగా నిలిచి విజయాన్ని అందించింది. 74 బంతుల్లో ధోని 70వ అర్ధ సెంచరీ... 52 బంతుల్లో జాదవ్‌  హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాయి. భారత్‌ 3 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సిన దశలో ధోని క్యాచ్‌ను మిడాఫ్‌లో ఫించ్‌ వదిలేశాడు. రెండు ఓవర్లలో 13 చొప్పున భారత్‌ 26 పరుగులు రాబట్టగా... ఆఖరి ఓవర్‌ రెండో బంతికి ఫోర్‌ కొట్టి జాదవ్‌ మ్యాచ్‌ను ముగించాడు. 

► 48 లక్ష్య ఛేదనలో ధోని నాటౌట్‌గా నిలవడం ఇది 48వసారి. ఇందులో భారత్‌ 46 సార్లు గెలవగా ఒక సారి ఓడింది. మరో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది.

►  103.07 ఛేదనలో భారత జట్టు గెలిచినప్పుడు ధోని సగటు. వందకు పైగా సగటు ఉన్న ఆటగాడు అతనొక్కడే. తర్వాతి స్థానంలో కోహ్లి (97.98) ఉన్నాడు.  

►  3 ఒకే సిరీస్‌లో ధోని మూడు హాఫ్‌ సెంచరీలు చేయడం  ఇది మూడో సారి. గతంలో ఇంగ్లండ్‌లో (2011), న్యూజిలాండ్‌లో (2014) అతను ఈ ఘనత సాధించాడు.  

►  1 ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ నెగ్గడం భారత్‌కిదే తొలిసారి.  

భారత క్రికెట్‌ పట్ల ధోనికి ఉన్న అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను కీలక పరుగులు సాధించడం పట్ల జట్టంతా సంతోషంగా ఉంది. దీంతో అతని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. బయటి వ్యక్తులు ఎన్నో మాటలు చెబుతుంటారు. కానీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేశానికి ఎంతో చేసిన ధోనిని తన మానాన వదిలేయండి. అతను చాలా తెలివైనవాడు. తాను ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ఈ టూర్‌ చాలా అద్భుతంగా గడిచింది. రెండు ఫార్మాట్‌లు గెలిచి మూడో దాంట్లో సమంగా నిలిచాం. ఆస్ట్రేలియా రావడానికి ముందు ఇలాంటి ఫలితం గురించి ఎవరైనా చెప్పి ఉంటే నేను కూడా ఆశ్చర్యపోయేవాడినేమో.            
– కోహ్లి, భారత కెప్టెన్‌  

ప్రైజ్‌మనీ లేదా!   గావస్కర్‌ విమర్శ
వన్డే సిరీస్‌ విజేతగా నిలిచిన జట్టుకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేకపోవడాన్ని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ తప్పు పట్టారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌లకు చెరో 500 డాలర్లు ఇవ్వగా... జట్టుకు మాత్రం ఆసీస్‌ బోర్డు ట్రోఫీతోనే సరి పెట్టింది. ‘500 డాలర్లు ఇవ్వడం ఏమిటి. పైగా జట్టుకు ఏమీ లేదు. నిర్వాహకులు ప్రసారహక్కుల ద్వారా భారీ మొత్తం ఆర్జిస్తారు. ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వలేరా. ఆటలో డబ్బులు వస్తున్నాయంటే అందుకు క్రికెటర్లే కారణం కాదా’ అని గావస్కర్‌ ప్రశ్నించారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top