కిం కర్తవ్యం! | team india :Criticism after defeat | Sakshi
Sakshi News home page

కిం కర్తవ్యం!

Jan 10 2018 1:09 AM | Updated on Sep 18 2018 8:48 PM

team india :Criticism after defeat - Sakshi

పరాజయం అనంతరం  విమర్శలు సహజం. తుది జట్టు కూర్పులో లోపాలపై వ్యాఖ్యలూ మామూలే. ఆటగాళ్ల వైఫల్యాన్ని ఎత్తిచూపడమూ సాధారణమే. కేప్‌టౌన్‌ టెస్టులో భారత జట్టు ఓటమితో ఇప్పుడిదే జరుగుతోంది. విదేశీ గడ్డపై మంచి సగటున్న అజింక్య రహానేతో పాటు, యువ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌లను కాదని రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లను ఆడించడాన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వారు అసలు టెస్టు ఆటగాళ్లే కాదంటున్నారు. పేస్‌కు అనుకూలించే రెండో టెస్టు మ్యాచ్‌ వేదిక సెంచూరియన్‌లో భారత జట్టు భవిత మారాలంటే బ్యాటింగ్‌ విభాగంలో మార్పులు చేయడం తప్పనిసరి అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.

సాక్షి క్రీడావిభాగం:  ఓటమికి జట్టంతా బాధ్యులైనా... ప్రత్యామ్నాయ పోటీని తట్టుకుని తుది జట్టులో చోటు దక్కించుకున్నందున శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ అందరికీ లక్ష్యంగా మారారు. ముఖ్యంగా షార్ట్‌ బంతులను పుల్‌ చేయబోయి అవుటైన ధావన్‌ విదేశీ గడ్డపై తన సామర్థ్యంపట్ల సందేహాలు రేకెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే అనవసరం అనుకుంటే... స్కోరు సాఫీగా సాగిపోతున్న రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరుగా షాట్‌ కొట్టి వికెట్‌ ఇచ్చుకున్నాడు. ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్‌ కావడం, ప్రత్యర్థి బౌలర్ల లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను దెబ్బ తీసేందుకు దానినో సాధనంగా కోహ్లి భావిస్తుండటం ఒక్కటే... లోకేశ్‌ రాహుల్‌ కంటే అతడిని ప్రత్యేకంగా నిలిపి తుది జట్టులో ఉండేలా చేసింది. ఇప్పటికైనా తప్పులు దిద్దుకుంటేనే ధావన్‌కు మున్ముందు సిరీస్‌లలో చోటు దక్కుతుంది. మరోవైపు స్వదేశంలో వీర విజృంభణ చేసిన రోహిత్‌ శర్మ సఫారీల పేస్‌ పదును ముందు తేలిపోయాడు. ఇటీవలి వన్డే ఫామ్‌ రీత్యా రహానేను కాదని అతడిని ఆడించామని కోహ్లి చెబుతున్నాడు. అయితే... తొలి ఇన్నింగ్స్‌లో ఆపసోపాలు పడుతూనే గంటకు పైగా క్రీజులో ఉన్నా, రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటే సందర్భం వచ్చినా అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. లక్ష్య ఛేదన సమయంలో రోహిత్‌ 30–40 పరుగులు చేసి ఉన్నా రహానేకు తానేమీ తీసిపోనని చాటినట్లయ్యేది. తద్వారా విమర్శలకు గురికాకుండా ఉండేవాడు. 

భాగస్వామ్యాలేవీ? 
టెస్టుల్లో జట్టును నిలబెట్టేవి భాగస్వామ్యాలే. రెండు మంచి భాగస్వామ్యాలు నమోదైతే మ్యాచ్‌ చేతుల్లోకి వచ్చేస్తుంది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌–డుప్లెసిస్‌ల 114 పరుగులు, డికాక్‌–కేశవ్‌ మహరాజ్‌ల 60 పరుగుల భాగస్వామ్యాలతో ఆ జట్టు కుదురుకుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ డివిలియర్స్‌ ఓ ఎండ్‌లో నిల్చొని కేశవ్‌తో 27 పరుగులు జోడించాడు. భారత్‌ తరఫున టాపార్డర్‌ ఇలా చేయడంలో విఫలమైంది. మన అత్యధిక భాగస్వామ్యాలు 99 (తొలి ఇన్నింగ్స్‌లో ఏడో వికెట్‌కు), 49 (రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిదో వికెట్‌కు) లోయర్‌ ఆర్డర్‌లోనే వచ్చాయి.  

ఆ ఇద్దరు వస్తారా...!
తొలి టెస్టులో ఉండాల్సిన వారంటూ అందరూ పేర్కొన్న అజింక్య రహానే, లోకేశ్‌ రాహుల్‌లు సోమవారం మ్యాచ్‌ ముగిసిన అనంతరం 90 నిమిషాల పాటు సాధన చేయడం గమనార్హం. వీరికితోడుగా పేసర్‌ ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌ చేశాడు. రెండో వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ చివర్లో కొంతసేపు ప్రాక్టీ్టస్‌లో పాల్గొన్నాడు.  

ముందంతా పేస్‌ ప్రతాపమే: కోచ్‌ గిబ్సన్‌ 
సిరీస్‌లోని మిగతా రెండు టెస్టుల్లోనూ నలుగురు పేస్‌ బౌలర్లతోనే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నామని దక్షిణాఫ్రికా బౌలింగ్‌ కోచ్‌ ఒటిస్‌ గిబ్సన్‌ పేర్కొన్నారు. ‘మేం స్వదేశంలో ఆడుతున్నాం. అందుకని మా ఫాస్ట్‌ బౌలింగ్‌ బలాబలాలను లెక్కలోకి తీసుకుంటాం. ముఖ్యంగా నేను ఫాస్ట్‌ బౌలింగ్‌ మైండ్‌ కోచ్‌ను. నా అంచనా ప్రకారం సెంచూరియన్‌ మరింత పేస్, బౌన్స్‌తో ఉంటుంది. ఈ సిరీస్‌తో పాటు, రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌కూ నలుగురు పేసర్ల కూర్పుతోనే బరిలో దిగాలనుకుంటున్నాం’ అని గిబ్సన్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement