
రషీద్ ఖాన్
బెంగళూరు: అఫ్గానిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్‌ను ఈసారి ఐపీఎల్ వేలంలో కూడా అదృష్టం వరించింది. గత ఐపీఎల్ వేలంలో నాలుగు కోట్లకు అమ్ముడుపోయిన రషీద్.. తాజాగా ఐపీఎల్-11 సీజన్ వేలంలో రూ. 9 కోట్ల దక్కించుకున్నాడు. ఈ రోజు బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి రోజు వేలంలో రషీద్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా, అతను భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం. రైట్ టు మ్యాచ్ కార్డ్ పద్ధతి ప్రకారం రషీద్‌ను తొమ్మిదికోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రషీద్‌ను కొనుగోలు చేయడానికి తొలుత కింగ్స్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి.
కాగా, చివర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తెరపైకి రావడంతో రషీద్ రేట్ అమాంతం పెరిగిపోయింది. రషీద్‌ను రూ. 9 కోట్లు దక్కించుకోవడానికి ఆర్సీబీ బిడ్ వేయగా, రైట్ టు మ్యాచ్ పద్దతిలో అదే రేటుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటిపెట్టుకుంది.