ఇదే మంచి అవకాశం 

sunil gavaskar fourth  test match analysis - Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

కఠిన పరిస్థితుల్లో చతేశ్వర్‌ పుజారా చేసిన సెంచరీ భారత జట్టుకు ఆధిక్యాన్ని అందివ్వడంతో పాటు మానసిక బలాన్నిచ్చింది. క్లిష్ట సమయంలో అతడు క్రీజులో పాతుకుపోయి చాలా సహనంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇప్పటి తరం బ్యాట్స్‌మెన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తెల్ల బంతిని బలంగా బాదేందుకు యత్నిస్తుంటారు. కానీ ఎర్రబంతితో ఆడేటప్పుడు అది అంత సులభం కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రారంభంలో పుజారా కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను కాచుకున్నాడు. ఆ తర్వాత కుదురుకున్నాక విలువైన శతకం బాదాడు. అతనికి ఇషాంత్, బుమ్రాల నుంచి చక్కటి సహకారం లభించడంతో భారత జట్టుకు స్వల్ప ఆధిక్యం దక్కింది.  నాలుగో టెస్టు తొలి రెండు రోజుల్లోనే 20 వికెట్లు పడటాన్ని బట్టి చూస్తే పిచ్‌లో జీవం ఉన్నట్లు అనిపిస్తోంది. ఇదే బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతోంది. స్పిన్‌కు అంతగా సహకరించని పిచ్‌పై మొయిన్‌ అలీ 5 వికెట్లు పడగొట్టడం టీమిండియాను మరింత ఆందోళనకు గురిచేస్తున్న అంశం.

నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదు. అందుకే భారత్‌ 150 నుంచి 200 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించాలనుకోదు. సీమర్లలో బుమ్రా అసాధారణ రీతిలో చెలరేగుతున్నాడు. వేగంతో పాటు బంతిని స్వింగ్‌ చేస్తూ... ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా కనిపిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో కనిపించిన కసి ఇషాంత్‌ బౌలింగ్‌లో లేకున్నా నిలకడగా రాణిస్తున్నాడు. షమీని దురదృష్టం వెంటాడుతోంది. అతని బంతులు ఎక్కువ శాతం ఎడ్జ్‌ తీసుకుంటున్నాయి. సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచినా బౌలర్లు సత్తాచాటడంతో తొలి రోజే భారత్‌ ఆధిపత్యం కనిపించింది. ఇలాగే కొనసాగితే సిరీస్‌ను సమం చేసేందుకు ఇది చక్కటి అవకాశం.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top