
ముంబై: ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్ జోరుకు అడ్డుకట్ట పడింది. గురువారం ఇక్కడి ఎరీనా ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 2–1 గోల్స్‌తో సునీల్ చెత్రి సేనను ఓడించింది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను 47వ నిమిషంలో కెప్టెన్ సునీల్ చెత్రి సాధించాడు. మరో రెండు నిమిషాల్లోనే న్యూజిలాండ్ స్ట్రయికర్ డి జాంగ్ గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మెసెస్ డైర్ (86వ నిమిషంలో) రెండో గోల్‌తో న్యూజిలాండ్‌కు ఆధిక్యాన్ని అందించాడు.
అదనపు ఐదు నిమిషాల్లో కూడా భారత్ మరో గోల్ చేయలేకపోయింది. దీంతో చెత్రి సేన ఫైనల్ చేరేందుకు ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ ఆరేసి పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ, కెన్యా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కెన్యా ఓడితే భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది.