రాకెట్‌ సూపర్‌హిట్‌...

Successful Premier Badminton League for three seasons - Sakshi

మూడు సీజన్లుగా విజయవంతమైన ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

కొత్త జట్లు, కొత్త ఆటగాళ్లతో కళకళ పెరిగిన ఆదరణ, అభిమానుల సంఖ్య 

పురుషులు, మహిళల విభాగాల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ షట్లర్లు... తొమ్మిది మంది ఒలింపిక్‌ పతక విజేతలు... ఎనిమిది మంది ప్రపంచ చాంపియన్‌ షిప్‌ పతక విజేతలు.. రూ. 6 కోట్ల ప్రైజ్‌మనీ... ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ 2018కు సంబంధించిన కొన్ని విశేషాలు ఇవి. తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఆదరణపరంగా కూడా లీగ్‌ మరో మెట్టు పైకెక్కింది. డిసెంబర్‌ 23న గువాహటిలో తొలి మ్యాచ్‌ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని నగరాల్లో ప్రేక్షకులు లీగ్‌కు బ్రహ్మరథం పట్టారు. అదనంగా వచ్చిన రెండు కొత్త జట్లను కూడా ఫ్యాన్స్‌ అక్కున చేర్చుకోగా... కొన్ని అద్భుత మ్యాచ్‌లు లీగ్‌ విలువను పెంచాయి. పైగా పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈసారి లీగ్‌లో భాగం కావడం పీబీఎల్‌ స్థాయిని చూపిస్తోంది.  

సాక్షి క్రీడా ప్రతినిధి: ‘పీబీఎల్‌ ప్రారంభంలో కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌ను అతి తక్కువ మొత్తానికి ఒక జట్టులోకి తీసుకుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. అతనికి అసలు సీనియర్‌ విభాగంలో ఆడే స్థాయి కూడా లేదన్నారు. అయితే గత రెండు సీజన్లలో సాత్విక్‌ ఆడిన కొన్ని మ్యాచ్‌లు, ఓడించిన ప్రత్యర్థులను చూస్తే అతను ఎంత అద్భుతంగా దూసుకుపోయాడో అర్థమవుతోంది. ఆ విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితాలు సాధించేందుకు దోహదం చేసింది. నా దృష్టిలో ఇదంతా కచ్చితంగా పీబీఎల్‌ ఘనతే. ఇలాంటి ప్రతిభ గల ఆటగాళ్లను అందించడమే ఈ లీగ్‌ సాధించిన విజయమని చెప్పగలను’... భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చేసిన వ్యాఖ్య ఇది. మూడు సీజన్ల తర్వాత అభిమానుల స్పందనలో గానీ ఆటపై ఇతర వర్గాల్లో ఆసక్తి పెంచడంలో గానీ పీబీఎల్‌ కూడా విజయవంతమైందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. వేర్వేరు క్రీడాంశాల్లో వరుసగా దూసుకొచ్చిన లీగ్‌ల జాబితాలో పీబీఎల్‌ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం విశేషం.  

సీన్‌ మారిపోయింది... 
నాలుగేళ్ల క్రితం ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (ఐబీఎల్‌) పేరుతో తొలిసారి ఈ తరహా లీగ్‌ జరిగింది. అయితే వేర్వేరు కారణాలతో ఒక్క ఏడాదికే అది పరిమితమైంది. ఆ తర్వాత కొన్ని మార్పులతో మళ్లీ తీసుకొచ్చిన ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)ను నిర్వాహకులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దానికి తోడు అంతర్జాతీయ స్థాయిలో భారత స్టార్లు సైనా, సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్‌ సాధించిన వరుస విజయాలు తటస్థ అభిమానులను ఈ ఆట వైపు లాక్కొచ్చాయి. ఫలితంగా పీబీఎల్‌ కూడా ప్రధాన లీగ్‌గా ఎదిగింది. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో సింధు ప్రదర్శన తర్వాత లీగ్‌పై పెద్ద ఎత్తున ఆసక్తి కనిపించింది. గత ఏడాదిలాగే ఇప్పుడు కూడా ప్రధాన స్పాన్సర్‌గా వొడాఫోన్‌ను కొనసాగించగలగడంలో పీబీఎల్‌ విజయవంతమైంది. దీనికి తోడు మరో ప్రధాన స్పాన్సర్‌గా ఈసారి ఇండియన్‌ ఆయిల్‌ కూడా వచ్చి చేరింది. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్, బిస్లెరివంటి సంస్థలు కూడా కొత్తగా జత చేరాయి. ఇక వివిధ టీమ్‌లకు ఉండే వ్యక్తిగత స్పాన్సర్లు వేరు. హైదరాబాద్‌ హంటర్స్‌ టీమ్‌తో బూస్ట్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం ఈ సీజన్‌లో మరో పరిణామం. సచిన్‌ టెండూల్కర్‌ లాంటి దిగ్గజం (బెంగళూరు బ్లాస్టర్స్‌ టీమ్‌) లీగ్‌లో భాగం కావడం కూడా స్పాన్సర్లను ఆకర్షించేందుకు కారణమైంది. ఇప్పటికిప్పుడే లాభాలు రాకపోయినా... లీగ్‌లో కొనసాగేందుకు ఒక్కో ఫ్రాంచైజీ ఏడాదికి దాదాపు రూ. 6.5 కోట్ల వరకు ఖర్చు చేస్తుండటం బ్యాడ్మింటన్‌పై వారి ఆసక్తికి నిదర్శనం.  

టాప్‌ ఆటగాళ్లూ సై... 
తొలి పీబీఎల్‌ సమయంలో అగ్రశ్రేణి విదేశీ ఆటగాళ్లు ఇందులో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత రెండో సీజన్‌లో అప్పటి వరల్డ్‌ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) వచ్చింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)కు కూడా ఇదో రెండో సీజన్‌. ప్రస్తుత మహిళల వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) ఇప్పుడు జరుగుతున్న పోటీలతో లీగ్‌లోకి అడుగు పెట్టింది. చైనా ఆటగాళ్లు కూడా లీగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. 2016 బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన తియాన్‌ హువీకి ఈ సారి వేలంలో రెండో అత్యధిక మొత్తం రూ. 58 లక్షలు లభించాయి. అన్ని వైపుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు ఈసారి మరో రెండు కొత్త జట్లను చేర్చి టోర్నీని నిర్వహించారు. ఇక భారత యువ షట్లర్లు అనేక మందికి పీబీఎల్‌ కొత్త దారులు తెరిచింది. సూపర్‌ సిరీస్‌ టోర్నీ స్థాయికి చేరితే మాత్రమే తలపడే అవకాశం ఉన్న అనేక మంది టాప్‌ ప్లేయర్లతో ఆడే అవకాశం రావడం, జట్టులో సభ్యులుగా వారి నుంచి నేర్చుకునే చాన్స్‌ కూడా దక్కడం స్ఫూర్తి పెంచుతుందనడంలో సందేహం లేదు. ‘ఇంత తొందరగా నా జీవితంలో వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ను కోర్టులో ఎదుర్కోగలనని అస్సలు ఊహించలేదు. మ్యాచ్‌ ఓడినా నేర్చుకున్న పాఠాలు కూడా గొప్పవి. పీబీఎల్‌ నాకిచ్చిన అవకాశం ఇది’ అని మహిళల సింగిల్స్‌ ప్లేయర్‌ రసిక రాజే ఆనందంగా చెప్పింది. ఇక హైదరాబాద్‌ అమ్మాయి సిక్కి రెడ్డి, శుభాంకర్‌ డే లాంటి వారికైతే తమ సత్తాను చూపించేందుకు పీబీఎల్‌ రూపంలో సరైన వేదిక లభించింది. ప్రతి మ్యాచ్‌లో రాణించిన ఆటగాళ్లకు అవార్డుల రూపంలో ఆకర్షణీయమైన మొత్తంలో నగదు దక్కుతోంది. ‘సూపర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు పొందిన వారికి రూ. 50 వేలు... ‘ఇండియన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద డే’కు రూ. 25 వేలు... ‘ఫాస్టెస్ట్‌ స్మాష్‌ ఆఫ్‌ ద డే’ కొట్టిన వారికి రూ. 25 వేలు అందజేస్తున్నారు. స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడుతున్న పీబీఎల్‌ ఎదుగుతున్న తీరు చూస్తే మున్ముందు మరింత పురోగతిని ఆశించవచ్చు.  

మన దేశంలో క్రికెటర్లు తప్పిస్తే ఇతర క్రీడాకారులు డబ్బు సంపాదించడం చాలా కష్టం. కానీ పీబీఎల్‌ చాలా విషయాలు మార్చేసింది. షట్లర్లకు లీగ్‌ ద్వారా ఆర్థికపరంగా కూడా మంచి ప్రయోజనం కలిగింది. మన దేశంలో ఒక లీగ్‌ ఇంతగా విజయవంతమవుతుందని కొన్నేళ్ల క్రితం కనీసం నేను ఊహించలేదు. అది ఇప్పుడు జరగడం సంతోషకరం. ఒకప్పుడు మనం చైనా, కొరియా ఆటగాళ్లను ఓడించడం కష్టమనే భావన ఉండేది. కానీ పీబీఎల్‌ వచ్చాక అలాంటి ఆలోచనలు మారిపోయాయి. ఈ లీగ్‌లో మా షట్లర్ల ఆటను చూడండి. వారు మరింత ప్రొఫెషనల్‌గా 
కనిపిస్తున్నారు.
– పీబీఎల్‌పై సైనా నెహ్వాల్‌ వ్యాఖ్య 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top