చాంపియన్‌కు షాక్‌

 Stefanos Tsitsipas dumps Roger Federer out of Australian Open - Sakshi

ప్రిక్వార్టర్స్‌లోనే ఓడిన ఫెడరర్‌

గ్రీస్‌ యువతార సిట్సిపాస్‌  పెను సంచలనం

గతేడాది రన్నరప్‌ సిలిచ్‌ కూడా ఇంటిముఖం

రెండో సీడ్‌ కెర్బర్, మాజీ విజేత షరపోవాలకు చుక్కెదురు

సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆదివారం సంచలనాల మోత మోగింది. ఒకే రోజు టాప్‌–10లోని నలుగురు సీడెడ్‌ క్రీడాకారులు నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌... గతేడాది రన్నరప్, ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌... 20వ సీడ్‌ దిమిత్రోవ్‌... మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌... మాజీ చాంపియన్‌ షరపోవా... ఐదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టారు.   

మెల్‌బోర్న్‌: అనుకున్నదొకటి... అయ్యిందొకటి. తొలి మూడు రౌండ్‌లలో అలవోకగా ప్రత్యర్థుల ఆట కట్టించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాత్రం మట్టికరిచాడు. అంతర్జాతీయస్థాయిలో తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్‌ యువతార స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో ఫెడరర్‌ కంగుతిన్నాడు. వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్‌ స్టార్‌కు... కెరీర్‌లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్‌ ఆడుతోన్న సిట్సిపాస్‌ ఊహించని షాక్‌ ఇచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 14వ సీడ్‌ సిట్సిపాస్‌ 6–7 (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్‌ ఫెడరర్‌పై గెలిచి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అంతేకాకుండా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్‌ ప్లేయర్‌గానూ గుర్తింపు పొందాడు. తన ప్రత్యర్థి 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత అని... 21 ఏళ్ల అనుభవమున్న దిగ్గజమని... కళాత్మక ఆటతీరుకు మరో రూపమని తెలిసినా... సిట్సిపాస్‌ అవేమీ పట్టించుకోలేదు. ఎలాంటి బెరుకు లేకుండా తొలి పాయింట్‌ నుంచి మ్యాచ్‌ పాయింట్‌ వరకు దూకుడుగానే ఆడాడు. ఫలితంగా తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ‘ప్రస్తుతం ఈ భూగోళం మీద అమితానందంగా ఉన్న వ్యక్తిని నేనే. నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి ఫెడరర్‌ను ఆరాధిస్తున్నాను. మరో దిగ్గజం రాడ్‌ లేవర్‌ పేరిట ఉన్న సెంటర్‌ కోర్టులోనే ఫెడరర్‌తో ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైంది. ఈ ఫలితాన్ని ఎలా వర్ణించాలో కూడా మాటలు రావడంలేదు’  అని ఫెడరర్‌ను ఓడించిన అనంతరం సిట్సిపాస్‌ వ్యాఖ్యానించాడు.‘నేను మంచి ప్లేయర్‌ చేతిలోనే ఓడిపోయాను. ఇటీవల కాలంలో సిట్సిపాస్‌ చాలా బాగా ఆడుతున్నాడు. కీలక సమయాల్లో అతను ఎంతో ఓర్పుతో ఆడాడు’ అని ఫెడరర్‌ ప్రశంసించాడు.

శక్తివంతమైన సర్వీస్‌లు... కచ్చితమైన రిటర్న్‌లు.. నెట్‌ వద్ద పైచేయి... ఏకంగా 12 బ్రేక్‌ పాయింట్లను కాపాడుకోవడం సిట్సిపాస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్‌ మొత్తంలో 20 ఏస్‌లు సంధించిన ఈ గ్రీస్‌ యువతార కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ మాత్రమే చేశాడు. మరోవైపు ఫెడరర్‌ 12 ఏస్‌లు కొట్టినా... 12 బ్రేక్‌ పాయింట్‌ అవకాశాల్లో ఒక్కటీ సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. 55 అనవసర తప్పిదాలు చేసిన ఈ స్విస్‌ స్టార్‌ తగిన మూల్యం చెల్లించుకున్నాడు.  

అగుట్‌ అద్భుతం... 
మరోవైపు 22వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌) మరో అద్భుత విజయం సాధించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. 3 గంటల 58 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అగుట్‌ 6–7 (6/8), 6–3, 6–2, 4–6, 6–4తో నిరుటి రన్నరప్, ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)ను ఓడించాడు. తొలి రౌండ్‌లో బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రేపై, మూడో రౌండ్‌లో పదో సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా)పై గెలిచిన అగుట్‌ క్వార్టర్‌ ఫైనల్లో సిట్సిపాస్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో అమెరికా యువతార టియాఫో 7–5, 7–6 (8/6), 6–7 (1/7), 7–5తో 20వ సీడ్‌ దిమిత్రోవ్‌ను ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. రెండో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6–0, 6–1, 7–6 (7/4)తో థామస్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచి టియాఫోతో క్వార్టర్‌ ఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యాడు.  

కెర్బర్‌ కుదేలు... 
మహిళల సింగిల్స్‌ విభాగంలో 2016 చాంపియన్, మాజీ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)కు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడుతోన్న 25 ఏళ్ల అమెరికా అమ్మాయి డానియెలా కొలిన్స్‌ 6–0, 6–2తో కెర్బర్‌ను చిత్తు చేసింది. గతంలో ఐదు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొన్న కొలిన్స్‌ ఏనాడూ తొలి రౌండ్‌ను దాటకపోగా ఆరో ప్రయత్నంలో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకోవడం విశేషం. మరో మ్యాచ్‌లో 15వ ర్యాంకర్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 4–6, 6–1, 6–4తో 30వ సీడ్, 2008 చాంపియన్, మాజీ నంబర్‌వన్‌ మరియా షరపోవా (రష్యా)ను బోల్తా కొట్టించి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 6–7 (3/7), 6–3, 6–3తో ఐదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై సంచలన విజయం సాధించగా... ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–1తో అమండా అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top