'ఆరోజు వారిని చంపేయాలన్నంత కోపం వచ్చింది'

Sreesanth Recalls His Spell In 2007 T20 WC Semi Final Vs Australia - Sakshi

తిరువనంతపురం : టీమిండియా స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్‌ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత ఓటమిని జీర్ణించుకోలేక ఆసీస్‌ క్రికెటర్లను చంపేయాలన్నంత కసిని పెంచుకున్నట్లు ఒక టీవీషోకు ఇచ్చిన ఇంటర్య్వూలో శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. కాగా 2003 ప్రపంచకప్‌లో టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో రెండు సార్లు ఓటమిపాలైంది. లీగ్ స్టేజ్‌లో 125 పరుగులకే ఆలౌట్ అయిన గంగూలీ సేన 8 వికెట్లతో పరాజయం చవిచూసింది. ఇక టైటిల్ ఫైట్‌లో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక అంతే పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ రెండు పరాజయాలు తన మనసులో నాటుకుపోయాయని, అవకాశం దొరికితే వారిని చంపేయాలనంత కసిని పెంచుకున్నానంటూ శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
(కేకేఆర్‌ ట్వీట్‌పై మనోజ్‌ ఆగ్రహం)

'2003 ప్రపంచకప్‌లో వారు భారత్‌ను ఓడించిన విధంగా చిత్తు చేయాలనుకున్నాను. ఆ ఓటమి ఎప్పటికీ నా మనస్సులో ఉంటుంది. వారిని చంపేయాలనంత కసిని పెంచింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లతో నేనెప్పుడూ చాలా కోపంగా ఉండేవాడిని. ఆ అవకాశం నాకు మళ్లీ 2007 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వచ్చింది. యార్కర్ వేయాలని భావించిన నా తొలి బంతిని మాథ్యూ హెడెన్‌ ఫోర్ కొట్టడం నాకింకా గుర్తుంది. ఆ మ్యాచ్‌ను మీరు చూసినట్లయితే.. నేను చాలా ప్యాషన్‌తో పరుగు తీయడం కనిపిస్తుంది. ఎలాగైనా ఆస్ట్రేలియాను ఓడించాలనుకున్నాను.  ప్రతీ ఒక్కరు మాట్లాడుకునే మ్యాచ్‌లో నన్ను భాగస్వామ్యం చేసిన ఆ దేవుడికి నేనెప్పుడు కృతజ్ఞుడిగా ఉంటా. నా దేశం తరపున నేను కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన అదే. ఆ మ్యాచ్‌లో నేను చాలా డాట్ బాల్స్ వేసాను. కేవలం రెండే ఫోర్లు ఇచ్చి12 పరుగులు మాత్రమే సమర్పించుకొని రెండు వికెట్లు కూడా తీశా. ఈ ఏడాది సెప్టెంబర్‌తో తనపై బీసీసీఐ విధించిన ఏడేళ్ల నిషేధం తొలిగిపోనుండటంతో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. (మూడో ఫైనల్‌.. రెండో ట్రోఫీ.. అదిరిందయ్యా ధోని)

ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్‌పై బోర్డు చర్యలు తీసుకుంది. అయితే దీనిపై కోర్టులకెళ్లి సుదీర్ఘ పోరాటం చేసిన ఈ కేరళ పేసర్.. పలుమార్లు తనకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నా బీసీసీఐ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ గతేడాది శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఆదేశాలిచ్చారు. దాంతో అతనిపై ఏడేళ్ల నిషేధ కాలం ఈ సెప్టెంబర్‌తో పూర్తి కానుంది. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్‌ టీమ్‌లలో శ్రీశాంత్ సభ్యుడిగా కొనసాగిన విషయం విధితమే. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో జోగి వేసిన ఆఖరి బంతిని క్యాచ్‌గా పట్టుకొని భారత్‌ విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top