
లిమా: పెరూ... దక్షిణ అమెరికా ఖండ దేశం. మూడున్నర దశాబ్దాల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. అది కూడా చిట్టచివరి బెర్త్‌తో. దీంతో అక్కడ సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అప్పట్లో ఏకంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఇప్పుడిక ప్రపంచ కప్ ముంగిట ఆ దేశానికి ఫుట్‌బాల్ జ్వరం పట్టుకుంది. ఈ ఉద్వేగంలో మరో అడుగు ముందుకేసి... ఫిఫా కప్‌ను పోలినట్లే ‘ఖైదీల ప్రపంచ కప్’నే నిర్వహించేశారు. మొత్తం 16 కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న వారితో ఆయా దేశాల పేర్ల మీద జట్లను రూపొందించారు. జాతీయ గీతాల ఆలాపన, రిఫరీల పర్యవేక్షణ, పటిష్ఠ పోలీసు భద్రత... ఇలా అంతా ఫిఫా కప్‌ను తలపించేలా చేశారు. ఇంకా ఆసక్తికరమేమంటే, స్టేడియంలో ఖైదీల కుటుంబ సభ్యులే అభిమానులు. అదీ పరిమితంగానే. లురిగాంచో జైలు జట్టుకు పెరూ దేశం పేరు, చింబోట్ కారాగార జట్టుకు రష్యా పేరు పెట్టారు. రెండింటి మధ్య జరిగిన తుది పోటీలో లురిగాంచో జట్టు పెనాల్టీ కిక్‌తో గెలుపొందింది. ఆటగాళ్లకు కప్‌తో పాటు బంగారు పతకాలు, క్రీడా దుస్తులను బహూకరించారు. డ్రగ్స్ సరఫరా–వినియోగంతో పాటు క్రైం రేట్ ఎక్కువగా ఉండే పెరూలో జైళ్లు నేరగాళ్లతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వానికిదో సమస్యగా మారింది. ఫిఫా ప్రపంచ కప్‌నకు అర్హత సాధించిన సంతోషం అందరికీ పంచేందుకు చేసిన ఆలోచన నుంచి వచ్చిందే ఖైదీల ప్రపంచకప్.
హమ్మయ్య... కెప్టెన్‌ను ఆడనిస్తున్నారు
దీనికంటే ముందు పెరూ ఓ పెద్ద ఇబ్బందిని తప్పించుకుంది. అది తమ కెప్టెన్ పావ్‌లో గ్యురెరో విషయంలో ఎదురైంది. జట్టు ప్రపంచ కప్‌నకు అర్హత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన గ్యురెరో డ్రగ్స్ వినియోగం అభియోగాలు ఎదుర్కొన్నాడు. దీంతో క్రీడల మధ్యవర్తిత్వ కోర్టు అతడిపై 14 నెలల పాటు నిషేధం విధించింది. ఇది పెరూకు అశనిపాతమైంది. అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడి, వినతులతో స్విట్జర్లాండ్ ఫెడరల్ సుప్రీంకోర్టు... అతడిపై నిషేధాన్ని ప్రపంచకప్ ముగిసేవరకు పక్కన పెట్టింది.