నరేంద్రజాలం

Special About Narendra Deepchand Hirwani Cricket Life - Sakshi

తొలి టెస్టులోనే 16 వికెట్లు పడగొట్టిన హిర్వాణి

ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు  

1988... మద్రాసు నగరం ‘పొంగల్‌’ వేడుకలకు సిద్ధమవుతోంది.  మరో వైపు చెపాక్‌ మైదానంలో వెస్టిండీస్‌తో భారత జట్టు టెస్టు మ్యాచ్‌లో తలపడుతోంది. గత తొమ్మిదేళ్లలో భారత గడ్డపై ఆడిన 16 టెస్టుల్లో 6 గెలిచి 10 డ్రా చేసుకొని ఓటమన్నదే ఎరుగని విండీస్‌ అప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. దాంతో భారత్‌ గెలుపు గురించి కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ టెస్టు క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే అరుదైన మ్యాచ్‌కు తాము సాక్షులం కాబోతున్నామనే విషయం చెన్నపట్నం అభిమానులకు అప్పుడు తెలీదు. ఒకే ఒక ఆటగాడు తన సంచలన ప్రదర్శనతో దీనిని చేసి చూపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 16 వికెట్లు తీసి 19 ఏళ్ల నరేంద్ర దీప్‌చంద్‌ హిర్వాణి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.

సిరీస్‌లో అప్పటికే వెనుకబడింది భారత్‌. దీంతో కచ్చితంగా నాలుగో టెస్టు గెలవాలి. ఇలాంటి విపత్కర సమయంలోనే నరేంద్ర హిర్వాణితో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లు డబ్ల్యూవీ రామన్, అజయ్‌ శర్మ కూడా అరంగేట్రం చేశారు. కళ్ల జోడు, హెడ్‌ బ్యాండ్, రిస్ట్‌ బ్యాండ్, మీసాలతో మధ్యప్రదేశ్‌కు చెందిన హిర్వాణి అందరికీ కొత్తగా కనిపించాడు. టెస్టుల్లో లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌పై ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కొన్నేళ్ల క్రితం లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వన్డేల్లో ప్రభావం చూపించినా... టెస్టుల్లో పేలవంగా బౌలింగ్‌ చేయడంతో మణికట్టు స్పిన్నర్‌పై అన్నీ సందేహాలే. ఇలాంటి స్థితిలో హిర్వాణికి ‘టెస్టు’ మొదలైంది. రవిశాస్త్రి కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఏకైక టెస్టును నరేంద్ర తన పేరిట లిఖించుకున్నాడు.

టపటపా... 
షేన్‌వార్న్, అనిల్‌ కుంబ్లేలు లెగ్‌స్పిన్‌కు ప్రాచుర్యం కల్పించక ముందు మణికట్టు మాయాజాలం ఏమిటో ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌లోనే చూశారు. లెగ్‌బ్రేక్‌లు, గూగ్లీలు, ఫ్లిప్పర్‌లు... ఇలా అన్ని ఆయుధాలతో హిర్వాణి వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రెండు వికెట్లు కపిల్, రవిశాస్త్రి తీయగా...తర్వాతి 8 హిర్వాణి ఖాతాలో చేరాయి. రెండో ఇన్నింగ్స్‌లో వ్యూహం మార్చిన కరీబియన్లు ముందుకొచ్చి షాట్లు ఆడుతూ హిర్వాణి లయ దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు.

కానీ అద్భుతమైన టర్న్‌తో అతను ప్రత్యర్థి పని పట్టాడు. ఫలితం మరో 8 వికెట్లు. ఇందులో నాలుగు స్టంపౌట్‌లు ఉన్నాయి.  అర్షద్‌ అయూబ్, రామన్‌ చెరో వికెట్‌ తీశారు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 136 పరుగులిచ్చి 16 వికెట్లు తీసిన హిర్వాణి అప్పటి వరకు బాబ్‌ మాసీ (ఆసీస్‌) పేరిట ఉన్న 16/137 రికార్డును బద్దలు కొట్టాడు. 32 ఏళ్లు దాటినా హిర్వాణి తొలి టెస్టు ఘనత మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. అతని జోరుతో భారత్‌ ఈ మ్యాచ్‌ను 255 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది.

చెప్పి మరీ...చేజిక్కించుకున్నాడు 
ఎందరినీ అవుట్‌ చేసినా కింగ్‌ వివియన్‌ రిచర్డ్స్‌ వికెట్‌ ఇచ్చే కిక్కే వేరు. ఈ విషయం హిర్వాణికి కూడా తెలుసు. రెండో రోజు ఆట ముగిసే సరికి రిచర్డ్స్‌ 62 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అప్పటి నిబంధనల ప్రకారం మూడో రోజు విశ్రాంతి దినం. రిచర్డ్స్‌ను తాను ఎలాగైనా అవుట్‌ చేస్తానంటూ హిర్వాణి రోజంతా సహచరులతో చెబుతూనే వచ్చాడు. నాలుగో రోజు ఆరంభంలోనే అతను వేసిన అద్భుతమైన ఫ్లిప్పర్‌ రిచర్డ్స్‌ స్టంప్స్‌ను ఎగరగొట్టింది.

అలా ముగిసిపోయింది... 
మెరుపులా దూసుకొచ్చిన హిర్వాణి కెరీర్‌ అంతే వేగంగా ముగిసిపోయింది. 16 వికెట్ల టెస్టు తర్వాత అతను మరో 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. మద్రాసు టెస్టు తర్వాత స్వదేశంలోనే జరిగిన తర్వాతి 3 టెస్టుల్లో కలిపి అతను 20 వికెట్లతో చెలరేగాడు. అయితే ఆ తర్వాత విదేశాల్లో అతని బౌలింగ్‌ మ్యాజిక్‌ పని చేయలేదు. 1989లో విండీస్‌ గడ్డపై జరిగిన సిరీస్‌లో వారు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఆడటంతో 3 టెస్టుల్లో 6 వికెట్లే దక్కాయి. 1990లో ఇంగ్లండ్‌ సిరీస్‌తో కుంబ్లే అడుగు పెట్టిన తర్వాత హిర్వాణికి దాదాపుగా దారులు మూసుకుపోయాయి. ఐదేళ్ల విరామం తర్వాత అనూహ్యంగా మళ్లీ టెస్టు అవకాశం దక్కినా లాభం లేకపోయింది. చివరకు 17 టెస్టుల్లో 30.10 సగటు, 66 వికెట్లతో హిర్వాణి కెరీర్‌ ముగిసింది. అతని కుమారుడు మిహిర్‌ హిర్వాణి కూడా తండ్రి బాటలోనే లెగ్‌స్పిన్నర్‌గా ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఇంకా ఇప్పటి వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయిన మిహిర్‌ 27 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 34.37 సగటుతో 70 వికెట్లు తీశాడు.
 
తనయుడు మిహిర్‌తో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top