ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు... | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు...

Published Fri, Jun 12 2020 12:57 AM

Sourav Ganguly Speaks About Conducting Of IPL 2020 - Sakshi

కరోనా దెబ్బకు ఆగిపోయిన ఐపీఎల్‌ను మళ్లీ నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇది కాస్త కార్యరూపం దాలిస్తే భారత అభిమానులకే కాదు యావత్‌ క్రికెట్‌ ప్రియులకు వినోదం పంచుతుంది. అసలే ప్రేక్షకులంతా క్రికెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పరితపిస్తున్నారు. మ్యాచ్‌లు గానీ జరిగితే టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. కోవిడ్‌–19 విలయంతో మార్చి, ఏప్రిల్‌లలో జరగాల్సిన ఈ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది.

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ విషయంలో మరోసారి కదలిక వచ్చింది. ఇన్నాళ్లు జరుగుతుందా లేదా అన్న సందేహాలతో ఊగిసలాడుతున్న లీగ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటన కొత్త ఊపిరి పోసింది. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ పోటీలు నిర్వహించేందుకైనా సిద్ధమేనని గంగూలీ సంకేతమిచ్చాడు. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నామని చెప్పాడు. బుధవారం ఐసీసీ బోర్డు మీటింగ్‌ ముగిసిన తర్వాత గంగూలీ లీగ్‌ వ్యవహారంపై దృష్టిసారించాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించేందుకు బోర్డు అన్ని అవకాశాల్ని సునిశితంగా పరిశీలిస్తుంది. గేట్లు మూసైనా సరే మ్యాచ్‌లు జరిపేందుకు సిద్ధంగా ఉంది. లీగ్‌ కోసం అభిమానులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, భాగస్వామ్య పక్షాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల భారత ఆటగాళ్లే కాదు... విదేశీ ఆటగాళ్లు సైతం లీగ్‌లో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మేం కూడా టోర్నీ జరుగుతుందనే ఆశావాహ దృక్పథంతో ఉన్నాం.

లీగ్‌ భవిష్యత్‌ కార్యాచరణను బోర్డు త్వరలోనే ప్రకటిస్తుంది’ అని గంగూలీ తెలిపాడు. అలాగే రాష్ట్రస్థాయి, దేశవాళీ సీజన్‌పై కూడా సమగ్ర కార్యాచరణతో ముందడుగు వేస్తామన్నాడు. ‘బోర్డు ఏ అవకాశాన్ని వదలట్లేదు. దేశవాళీ క్రికెట్‌పై ప్రణాళికను సిద్ధం చేస్తుంది. రంజీ, దులీప్, విజయ్‌ హజారే టోర్నీల నిర్వహణ కోసం విస్తృతంగా పరిశీలిస్తుంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలను బోర్డు వెల్లడిస్తుంది’ అని గంగూలీ అన్నాడు. దీనికి సంబంధించి బుధవారం గంగూలీ రాష్ట్ర క్రీడా సంఘాలకు లేఖ రాశాడు. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్ని అధిగించేందుకు బోర్డు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను రూపొందించే పనిలో ఉందని, రాష్ట్ర సంఘాలకు ఎస్‌ఓపీ మార్గదర్శకాలు విడుదల చేస్తుందని, ముందస్తు జాగ్రత్తలు, రక్షిత ఏర్పాట్లన్నీ అందులో ఉంటాయని చెప్పాడు. ఇందుకోసం సభ్య రాష్ట్ర సంఘాలన్నీ సమగ్ర వివరాలతో నిధుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని గంగూలీ పేర్కొన్నారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అలాగే టి20 ప్రపంచకప్‌పై కూడా లీగ్‌ నిర్వహణ ఆధారపడివుంది. ఐసీసీ గనక మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తే ఆ తేదీలను ఐపీఎల్‌కు వినియోగించుకోవాలని బోర్డు భావిస్తోంది. ఐపీఎల్‌ జరగకపోతే బీసీసీఐ సుమారు రూ. 4 వేల కోట్లు నష్టపోయే అవకాశం ఉంది. మరో వైపు ప్రేక్షకులే లేకుండా టోర్నీ జరపాలని భావిస్తే ఏ దేశంలో నిర్వహించినా ఒకటేనని లీగ్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement