ధోనికంటే ‘దాదా’నే నాకు గొప్ప! 

Sourav Ganguly Is The Best In My Cricket Career Says Yuvraj Singh - Sakshi

కెప్టెన్‌గా అండగా నిలిచాడన్న యువరాజ్‌ 

న్యూఢిల్లీ: ఒక కెప్టెన్‌గా తన కెరీర్‌లో సౌరవ్‌ గంగూలీ అందరికంటే ఎక్కువగా మద్దతుగా నిలిచాడని భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు. ధోనితో పోలిస్తే దాదా నాయకుడిగా ఉన్న సమయంలోనే తన కెరీర్‌ బాగా సాగిందని అతను గుర్తు చేసుకున్నాడు. భారత్‌ తరఫున యువీ 304 వన్డేలు ఆడగా ఇందులో గంగూలీ సారథ్యంలో 110 మ్యాచ్‌లు, ధోని కెప్టెన్సీలో 104 మ్యాచ్‌లు ఆడాడు. ‘సౌరవ్‌ కెప్టెన్సీలో నేను ముందుగా ఆడాను. ఆ సమయంలో అతను నాకు చాలా అండగా నిలిచాడు. ఆ తర్వాత ధోని కెప్టెనయ్యాడు. ఇద్దరిలో ఎవరు అత్యుత్తమమో చెప్పడం కొంత కష్టమే అయినా... సౌరవ్‌ మద్దతుగా నిలిచిన సమయంలోనే నా కెరీర్‌ మధురానుభూతులు ఉన్నాయి.

ధోని నుంచి గానీ ఆ తర్వాత కోహ్లి నుంచి గానీ నాకు ఆ తరహా మద్దతు ఎప్పుడూ లభించలేదు’ అని యువీ వ్యాఖ్యానించాడు. తన కెరీర్‌లో ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బంది పడ్డానని, అయితే ఆ తర్వాత సచిన్‌ సలహాతో స్వీప్‌ చేయడం మొదలు పెట్టాక పరిస్థితి మెరుగైందని యువరాజ్‌ అన్నాడు. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌లో కూడా ఆడలేకపోయేవాడినని, అయితే టెస్టు జట్టులో రెగ్యులర్‌ కాకపోవడం వల్ల మెక్‌గ్రాత్‌ను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం రాలేదని అతను అన్నాడు. ఐపీఎల్‌ వచ్చిన తర్వాత కుర్రాళ్లకు చాలా డబ్బు వచ్చిపడుతోందని, దాంతో వారు తమ సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని యువరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ఐపీఎల్‌ లేని రోజుల్లో నేను అరంగేట్రం చేశాను. నేను టీవీలో ఆరాధించే హీరోలతో కలిసి ఆడే అవకాశం వచ్చినప్పుడు వారంటే ఎంతో గౌరవం చూపించాను. ఎలా ప్రవర్తించాలో, మీడియాతో ఎలా మాట్లాడాలో వారు నేర్పించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కొందరు ఈతరం కుర్రాళ్లతో మాట్లాడుతుంటే వారు సీనియర్లను ఏమాత్రం లెక్క చేయరని అర్థమైంది. నేను ద్రవిడ్, వెంకటేశ్‌ ప్రసాద్, కుంబ్లేలాంటి వారితో తిట్లు కూడా తిన్నాను. కానీ వారి ద్వారా ఎంతో నేర్చుకున్నాను కూడా’ అని యువీ విశ్లేషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ధరించిన ‘12’ నంబర్‌ జెర్సీకి బీసీసీఐ రిటైర్మెంట్‌ ఇవ్వాలని, మరెవరూ దానిని వాడరాదంటూ కొందరు అభిమానులు కోరడం తనకు ‘అతి’గా అనిపించిందని యువరాజ్‌ అన్నాడు. టెస్టుల్లో ‘12’ నంబర్‌ను ఇప్పుడు పృథ్వీ షా ధరిస్తున్నాడు. ‘జెర్సీ సంఖ్య అనేది సమస్యే కాదు. పృథ్వీలాంటి ప్రతిభావంతుడు దానిని ధరించడం సంతోషకరమే. అతనిలో ఎంతో సత్తా ఉంది. పృథ్వీ ఎప్పుడు బరిలోకి దిగినా మనం అండగా నిలవాలి’ అని యువీ స్పష్టం చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top