సైనా ఇంటికి...  సింధు ముందుకు 

Sindhu, Sameer & Srikanth enter pre-quarterfinals of Hong Kong Open - Sakshi

ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్,  సమీర్‌ వర్మ, ప్రణయ్‌

హాంకాంగ్‌ ఓపెన్‌ టోర్నీ

కౌలూన్‌ (హాంకాంగ్‌): ఈ ఏడాది లోటుగా ఉన్న వరల్డ్‌ టూర్‌ సూపర్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో హాంకాంగ్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింధు శ్రమించి శుభారంభం చేయగా... సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ సింధు 21–15, 13–21, 21–17తో నిచావోన్‌ జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. సైనా 21–10, 10–21, 19–21తో రెండో సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఒకదశలో 14–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ దశలో యామగుచి విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 16–14తో ముందంజ వేసింది. ఆ తర్వాత సైనా స్కోరును 18–18తో సమం చేసింది. కానీ ఆ వెంటనే రెండు పాయింట్లు కోల్పోయి 18–20తో వెనుకబడింది. సైనా మరో పాయింట్‌ సాధించినా, ఆ తర్వాత మరో పాయింట్‌ కోల్పోయి ఓటమిని మూట గట్టుకుంది. ఓవరాల్‌గా యామగుచి చేతిలో సైనాకిది ఏడో పరాజయం కావడం గమనార్హం.  

సాయిప్రణీత్, కశ్యప్‌ పరాజయం 
పురుషుల సింగిల్స్‌లో ఐదుగురు భారత ఆటగాళ్లు బరిలోకి దిగగా... సాయిప్రణీత్, క్వాలిఫయర్‌ పారుపల్లి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. కిడాంబి శ్రీకాంత్, సమీర్‌ వర్మ, ప్రణయ్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–11, 21–15తో వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై, సమీర్‌ వర్మ 21–17, 21–14తో సుపన్యు అవింగ్‌ సనోన్‌ (థాయ్‌లాండ్‌)పై, ప్రణయ్‌ 21–14, 13–21, 21–19తో ఆండర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)పై గెలిచారు. సాయిప్రణీత్‌ 21–16, 11–21, 15–21తో ఖోసిత్‌ ఫెట్‌ప్రదాబ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో... కశ్యప్‌ 16–21, 13–21తో ఆంథోనీ గిన్‌టింగ్‌ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో ఖోసిత్‌పై మూడుసార్లు నెగ్గిన సాయిప్రణీత్‌ ఈసారి మాత్రం బోల్తా పడ్డాడు.  

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మను అత్రి (భారత్‌) జంట 21–12, 21–18తో బొదిన్‌ ఇసారా–మనీపాంగ్‌ జోంగ్‌జిత్‌ (థాయ్‌లాండ్‌)పై జోడీపై నెగ్గగా... సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 19–21, 21–23తో మథియాస్‌ బో–కార్స్‌టెన్‌ మోగెన్సన్‌ (డెన్మార్క్‌) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జోడీ 21–18, 10–21, 8–21తో రెండో సీడ్‌ మిసాకి మత్సుమోతో–అయాక తకహాషి (జపాన్‌) జంట చేతిలో పరాజయం పాలైంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top