
సాక్షి, హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నాయకత్వంలో చెన్నై స్మాషర్స్ జట్టు గతంలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) విజేతగా నిలిచింది. ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసి జట్టును విజేతగా నిలపాలని సింధు భావిస్తోంది. అయితే ఈసారి ఆమె సొంత నగరానికి చెందిన ‘హైదరాబాద్ హంటర్స్’ తరఫున బరిలోకి దిగనుంది. డిఫెండింగ్ చాంపియన్ కూడా అయిన హంటర్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు శక్తిమేర కృషి చేస్తానని సింధు చెప్పింది. జట్టు సహచరులు మేఘన, రాహుల్ యాదవ్, అరుణ్ జార్జ్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడింది. ‘పీబీఎల్‌లో తొలిసారి హైదరాబాద్ తరఫున ఆడబోతుండటం పట్ల చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను.
గతంలో వేరే జట్టు తరఫున బరిలోకి దిగినా సరే నాకు స్టేడియంలో అభిమానులు బ్రహ్మాండంగా మద్దతునిచ్చారు. ఈసారి మన టీమ్‌కే ఆడుతున్నాను కాబట్టి అలాంటి మద్దతునే ఆశిస్తున్నాను’ అని సింధు వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లయిన లీ హ్యూన్ (కొరియా), ఇసారా (థాయిలాండ్)లాంటి ఆటగాళ్లు తమ జట్టులో ఉండటం వల్ల విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. మీడియా సమావేశంలో హంటర్స్ జట్టు యజమాని వీఆర్‌కే రావు తదితరులు పాల్గొన్నారు. పీబీఎల్ డిసెంబర్ 22న ప్రారంభం కానుండగా... 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి.