వారి పక్కన నిలబడటం నా అదృష్టం : శ్రేయస్‌ అయ్యర్‌

Shreyas Iyer Comments After Lost Match To CSK - Sakshi

ఐపీఎల్‌ సీజన్‌12లో భాగంగా జరిగిన క్వాలిఫయర్‌ 2లో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్లతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. తద్వారా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ధోనీ సేన ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ కుర్ర కెప్టెన్‌ శ్రేయస్‌ ఢిల్లీ జట్టును నడిపించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీజన్‌లో కొత్త జెర్సీ.. జట్టు పేరు మార్పుతో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ కనీసం మూడో స్థానంలోనైనా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌ దశకు చేరి ఎలిమినేటర్‌లోనూ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్‌ రానున్న సీజన్‌లలో మరింత మెరుగ్గా రాణించి ఐపీఎల్‌ కప్‌ సాధిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌ 11 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సారథిగా పగ్గాలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌.. జట్టు వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 12వ సీజన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌గా బరిలోకి దిగిన జట్టును మూడో స్థానంలో నిలపడం ద్వారా తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని శ్రేయస్‌ నిలబెట్టుకున్నాడనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపాడు.

గర్వంగా ఉంది..
‘ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా గర్విస్తున్నా. మాపై ఒత్తిడి ఉంటుందన్న మాట నిజం.  అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయాం. వపర్‌ప్లేలో చెన్నై స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కఠినంగా మారింది. వికెట్‌ అనుకూలిస్తుంది కాబట్టి బ్యాట్స్‌మెన్‌ రాణిస్తారనుకున్నా. కానీ అలా జరుగలేదు. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. మాకు ఇదొక మంచి గుణపాఠం. అయినప్పటికీ నా టీమ్‌ ప్రదర్శన పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. నిజానికి ఈ సీజన్‌ మా కలను కాస్తైనా నెరవేర్చింది. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై రానున్న సీజన్‌లో మరింత మెరుగ్గా రాణిస్తాం. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు’ అని అయ్యర్‌ పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్‌లో..‘ టాస్‌ వేసే సమయాల్లో ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి మేటి కెప్టెన్ల పక్కన నిలబడటం అదృష్టంగా భావిస్తున్నా. వారు జట్లను నడిపించిన తీరు చూసి.. కెప్టెన్‌గా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అంటూ ఈ యువ కెప్టెన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

చదవండి : ఎనిమిదోస్సారి

కాగా విశాఖ వేదికగా జరిగిన క్యాలిఫైయర్‌ 2 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, కొలిన్‌ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్‌ చహర్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 62 బంతుల్లో 81 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top