దాదా భయపడేవాడు కాదు: అక్తర్‌

Shoaib Akhtar Picks The Bravest Batsman Indian batsman - Sakshi

ఇస్లామాబాద్‌: టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై పాకిస్తాన్‌ స్పీడస్టర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. దాదా భయమెరుగని ఓ పోరాటయోధుడంటూ ఆకాశానికి ఎత్తాడు. సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోని వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేసే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వారికి బౌలింగ్‌ చేయడం ఓ సవాల్‌గా తీసుకునే వాడినని తెలిపాడు. అయితే ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి దాదా భయపడేవాడనే వార్తలను అక్తర్‌ కొట్టిపారేశాడు. (‘కోహ్లిలా ఆడాలి.. పాక్‌ను గెలిపించాలి’)

‘ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఎదుర్కోడానికి గంగూలీ భయపడేవాడని, అందులోనూ నా బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బందిపడ్డాడనే వార్తలు పూర్తిగా అవాస్తవం. గంగూలీ అత్యంత ధైర్యవంతమైన బ్యాట్స్‌మన్‌. కొత్త బంతితో నా బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల ఏకైక ఓపెనర్‌ దాదానే. అనేకమార్లు అతడిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించేవాడిని. ఛాతి మీదకు బంతులేస్తూ అతడిని టార్గెట్‌ చేసేవాడిని. కానీ అతడు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. దాటిగా ఆడి పరుగులు సాధించేవాడు. అందుకే భారత ఆటగాళ్లలో నేను బౌలింగ్‌ చేసిన వారిలో గంగూలీనే అత్యంత ధైర్యవంతమైన బ్యాట్స్‌మన్‌ అని ఎప్పటికీ చెబుతుంటాను. ఇప్పుడూ అదే చెబుతాను. ఇక అతడి సారథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడికన్నా మరో బెస్ట్‌ కెప్టెన్‌ను భారత్‌ తయారుచేయలేకపోయింది అనేది నా అభిప్రాయం’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. (ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు...)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top