కోహ్లికి మద్దతు పలికిన పాక్‌ క్రికెటర్‌

Shoaib Akhtar Gives Full Backing to Virat Kohli as India Skipper - Sakshi

ఇస్లామాబాద్‌ : ప్రపంచకప్‌ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అప్పగించాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. ప్రపంచకప్‌ ప్రదర్శనపై ఒక్క సమీక్షా సమావేశం లేకుండానే కోహ్లిని తిరిగి కెప్టెన్‌గా కొనసాగించడాన్ని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ సైతం తప్పుబట్టాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్రికెట్‌ విషయాలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేసే పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ మాత్రం టీమిండియా కెప్టెన్సీ మార్పు అవసరం లేదన్నాడు. కెప్టెన్‌గా కోహ్లినే సరైనవాడని చెప్పుకొచ్చాడు. మంగళవారం ట్విటర్‌రో అభిమానుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. ‘రోహిత్‌ శర్మ టీమిండియా సారథ్య బాధ్యతలు చేపడుతాడా?’ అని ప్రశ్నించాడు. దీనికి అక్తర్‌ ఆ అవసరం లేదని సమాధానమిచ్చాడు. ప్రస్తుతం కోహ్లినే సరైన వాడని అభిప్రాయపడ్డాడు.

ప్రపంచకప్‌ ఓటమితో జట్టు విభేదాలు తలెత్తాయని, ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌ శర్మకు అసలు పడటం లేదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీ కాపాడుకోవడానికే కోహ్లి వెస్టిండీస్‌ పర్యటకు వెళ్తున్నాడనే పుకార్లు వెలువడ్డాయి. వీటిపై కెప్టెన్‌ కోహ్లి విండీస్‌ పర్యటనకు ముందు నిర్వహించిన సమావేశంలో స్పష్టతనిచ్చినా ఈ తరహా ప్రచారం ఆగడం లేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top