
తియాన్‌జిన్ (చైనా): రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత ఓ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరింది. తియాన్‌జిన్ ఓపెన్ టోర్నీలో ఈ మాజీ నంబర్‌వన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో షరపోవా 6–3, 6–1తో షుయె పెంగ్ (చైనా)పై గెలిచింది.
ఆదివారం జరిగే ఫైనల్లో అర్యానా సబలెంకా (బెలారస్)తో షరపోవా తలపడుతుంది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 2016 ఆరంభంలో డోపింగ్‌లో పట్టుబడిన ఈ రష్యా స్టార్‌పై 15 నెలల సస్పెన్షన్ విధించారు. నిషేధం గడువు పూర్తి కావడంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టట్‌గార్ట్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేసింది.